ముంబై ఉగ్ర దాడి నిందితుడి అప్పగింతకు సిద్ధం

ముంబై ఉగ్ర దాడి నిందితుడి అప్పగింతకు సిద్ధం

16 ఏళ్ల క్రితం ముంబై మహా నగరంలో జరిగిన మారణహోమాన్ని తలుచుకుంటే దేశ ప్రజలకు ఇప్పటికీ వణుకు పడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను అమెరికా నుంచి భారత్‌కు అప్పగించేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కేసులో తహవూర్‌ రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

64 ఏళ్ల తహవూర్‌ రాణా పాకిస్థాన్‌ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా అతడిని గుర్తించారు. ప్రస్తుతం రాణా లాస్‌ ఏంజెల్స్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించాలని భారత్‌ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. 

ఇక అతడి అప్పగింత విషయమైన భారత్‌ న్యాయస్థానాల్లో పోరాడుతోంది. ఈ క్రమంలో భారత్‌ ప్రయత్నాలను తహవూర్‌ పలు ఫెడరల్‌ కోర్టుల్లో సవాల్‌ చేశాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ పిటిషన్‌లు వేశాడు. అయితే, రాణా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్‌ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో అతడు చివరి ప్రయత్నంగా గతేడాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశాడు. అతడి పిటిషన్‌పై అమెరికా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా అతడి పిటిషన్‌ను కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. 

సుప్రీం తీర్పుతో న్యాయపరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. 16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్‌ 26న పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు.

కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ హోటల్‌, లియోపోల్డ్‌ కేఫ్‌, ముంబై చాబాద్‌ హౌస్‌, నారిమన్‌ హౌస్‌, కామా హాస్పిటల్‌ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. 

ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసులో అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో రాణాను భారత్‌కు అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.