రేవంత్ ఏలుబడిలో లంచాల అడ్డాగా తెలంగాణ

రేవంత్ ఏలుబడిలో లంచాల అడ్డాగా తెలంగాణ
రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింద‌ని గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవ‌డంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ మేర‌కు రాజాసింగ్ ఒక వీడియో విడుద‌ల చేశారు. “ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రం లంచాల‌కు అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ, ఏసీపీ లంచాలు తీసుకోవాలంటే భ‌యం ఉండేది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత లంచాల దందా పెరిగింది” అని ఆరోపించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌రిధిలోని జ‌మ్మికుంట పోలీసు స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ ర‌వికుమార్‌కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైర‌ల్ అవుతోంది. 

ఆ ఇన్‌స్పెక్ట‌ర్ ఓ కేసులో 3 ల‌క్ష‌లు లంచం తీసుకున్న‌ట్లు ఆ ఆడియోలో ఉంది. ఇన్‌స్పెక్ట‌ర్ బాత్రూంలో డ‌బ్బులు పెట్టిన‌ట్లు బాధితుడు చెబుతున్నాడు. సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయాల‌ని బాధితుడు ఉన్న‌తాధికారుల‌ను వేడుకుంటున్న‌ట్లు ఆడియోలో ఉంద‌ని రాజాసింగ్ తెలిపారు.

ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గం గోషామ‌హ‌ల్ ప‌రిధిలోని షాహినాత్ గంజ్ పోలీసు స్టేష‌న్‌లో సీఐ ఏ బాబు చౌహాన ఒక కేసు నుంచి పేరు తీసేయాలంటే ల‌క్షా యాభై వేలు అడిగిండు. డీల్ రూ. 50 వేల‌కు ఫైన‌ల్ అయింది. బాధిత వ్య‌క్తి నుంచి రూ. 50 వేలు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు ఆయ‌న‌ను అరెస్టు చేశారని గుర్తు చేశారు. 

ఈ ఏడాదిలో చాలా వ‌ర‌కు పోలీసులు లంచాలు తీసుకుంటూ అరెస్టు అవుతున్నారని రాజాసింగ్ తెలిపారు. లంచం మాఫియాపై సీవీ ఆనంద్ దృష్టి పెట్టాలని కోరారు. పోలీసు అధికారులు వారి ఛాంబ‌ర్‌లో కూడా సీసీ కెమెరాలు పెట్టాల‌ని డీజీపీ, సీపీని ఆయన కోరారు. అక్ర‌మంగా కేసు పెట్టిన త‌ర్వాత, ఆ కేసులో పేరు తీసేసేందుకు డ‌బ్బులు అడ‌గ‌డం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రైమ్‌లో లేని నేను రూ. 50 వేలు ఎందుకివ్వాల‌ని ఏసీబీకి ఫిర్యాదు చేసిండని పేర్కొంటూ మ‌రి క్రైమ్ చేసిన వారి నుంచి ఎంత డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ఉండే ప్ర‌తి చోట సీసీ కెమెరాలు పెట్టాలి. ఇలాంటి అధికారులు  లంచాలు తీసుకున్న‌ప్పుడు స‌స్పెన్ష‌న్ చేయ‌కుండా, జాబ్ నుంచి పూర్తిగా తొల‌గించాల‌ని, ఇందుకు స్పెష‌ల్‌గా ఒక జీవో తీసుకురావాల‌ని ముఖ్యమంత్రికి  రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.