ఇన్‌కాయిస్‌కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం

ఇన్‌కాయిస్‌కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం

విపత్తుల నివారణకు నిస్వార్థ సేవలందించే పౌరులకు, సంస్థలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ‘ఆప్ద ప్రబంధన్‌’ పురస్కారం ఈ ఏడాదికి గాను హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న విపత్తు నిర్వహణలో అద్భుతంగా పనిచేసినందుకు ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓసియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (ఇన్‌కాయిస్‌)కు లభించింది. 

ఈ పురస్కారం కింద రూ.51 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. నేతాజీ జయంతి సందర్భంగా గురువారం నాడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. ఈ పురస్కారానికి గత ఏడాది జులై నుంచి దరఖాస్తులు ఆహ్వనించగా ..295 నామినేషన్లు వచ్చినట్లు హోంశాఖ వెల్లడించింది. వీటిలో ఇన్‌కాయిస్‌ను పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది.

హైదరాబాద్‌లో 1999లో స్థాపించిన ఇన్‌కాయిస్‌ సముద్ర సంబంధిత ప్రమాదాల గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో ప్రఖ్యాతిగాంచింది. ఇండియన్‌ సునామీ ఎర్లీ వార్నింగ్‌ సెంటర్‌ (ఐటిఇడబ్ల్యుసి) వ్యవస్థతో 10 నిమిషాల్లోనే ఈ సంస్థ సునామీ హెచ్చరికలను అందజేయగలదు.  మన దేశంతో పాటు హిందూ మహా సముద్రం పరిధిలోని 28 దేశాలకు ఈ సేవలను అందిస్తున్నది.

సునామీ సర్వీస్‌ ప్రొవైడర్‌ గా యునెస్కో సైతం ఇన్‌కాయిస్‌ను గుర్తించింది. భూకంప కేంద్రాలు, అలల తీవ్రత, ఇతర సముద్ర సెన్సార్‌ల నెట్‌వర్క్‌కు ఈ సంస్థ సమాచార సేవలందిస్తోంది. 2013 ఫైలిన్‌, 2014 హుద్హుద్‌ తుఫాను సమయంలో అందించిన సలహాలు, సహాయంతో సకాలంలో ప్రజల తరలింపు, తీరప్రాంత ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. 

సముద్రంలో గల్లంతైన వ్యక్తులు, వస్తువులను గుర్తించడంలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, నేవీ, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులకు సహకారం అందించేందుకు ప్రత్యేకంగా సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఎయిడెడ్‌ టూల్‌ (సరత్‌)ని అభివృద్ధి చేసి ఇన్‌కాయిస్‌ సేవలందిస్తోంది.