రష్యా తరుఫున యుద్ధంలో 12 మంది భారతీయులు మృతి

రష్యా తరుఫున యుద్ధంలో 12 మంది భారతీయులు మృతి
ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరుఫున పోరాడిన భారతీయుల్లో 12 మంది మరణించారు. మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని నిర్ధారించింది. యుద్ధంలో మరణించిన భారతీయుల మృతదేహాలను, గాయపడిన వారిని దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించింది. 
 
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరుఫున ఫైట్‌ చేసిన కేరళకు చెందిన బినిల్ బాబు మరణించాడు. గాయపడిన మరో భారతీయుడు జైన్ టికె, మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  కాగా, తాజా మరణాల నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయులపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. 
 
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 126 మంది భారత పౌరులు రష్యా సైన్యంలో పని చేశారని తెలిపారు. 96 మందిని రష్యా ఆర్మీ నుంచి డిశ్చార్జ్‌ చేయడంతో వారు దేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.మరోవైపు రష్యా సైన్యంలో చేరిన వారిలో 12 మంది భారతీయ పౌరులు మరణించారని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రస్తుతం రష్యా ఆర్మీలో 18 మంది భారతీయులు మగిలి ఉ్నట్లు చెప్పారు. అయితే వీరిలో 16 మంది ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. వారు తప్పిపోయినట్లుగా రష్యా పేర్కొన్నదని వివరించారు. మిగిలిన భారతీయులను రష్యా ఆర్మీ నుంచి డిశ్చార్జ్‌ చేసి త్వరగా స్వదేశానికి పంపాలని ఆ దేశాన్ని భారత్ కోరిందని చెప్పారు.