* ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి హామీలు
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ దిల్లీ శాఖ కార్యాలయం వేదికగా ‘సంకల్ప్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 రాయితీ ఇస్తామని ప్రకటించింది.
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 అందిస్తామని తెలిపారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ స్కీమ్‌ను ఆమోదిస్తామని చెప్పారు. అలాగే గర్భిణీలకు రూ.21,000 అందుతుందని ప్రకటించారు. కాగా, ఎల్పీజీ వాడుతున్న కుటుంబాలకు సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ లభిస్తుందని జేపీ నడ్డా తెలిపారు.
హోలీ, దీపావళి సందర్భంగా ఒక్కో గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందుకుంటారని చెప్పారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భరత్ ఆరోగ్య పథకాన్ని ఢిల్లీలో అమలు చేస్తామని ప్రకటించారు. రూ.5 లక్షల ఆరోగ్య బీమాకు అదనంగా మరో రూ.5 లక్షల ఆరోగ్య రక్షణను ప్రతి కుటుంబానికి కల్పిస్తామని వివరించారు.
మరోవైపు మురికివాడల్లో అటల్ క్యాంటీన్ల ద్వారా రూ.5కే పౌష్టికార భోజనం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం వంటి అమలులో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది. నగర వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు కొత్తగా చర్యలు తీసుకుంటూ అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని నడ్డా చెప్పారు. బడుగు వర్గాలతో సహా సమాజంలోని అన్నివర్గాలను సంక్షేమానికి పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.
2014లో తాము 500 వాగ్దానాలు చేశామని, 499 వాగ్దానాలను అమలు చేశామని, 2019లో 235 వాగ్దానాల్లో 225 నెరవేర్చామని చెప్పారు. తక్కినవి కూడా వివిధ దశల్లో అమలుకు సిద్ధమవుతున్నాయని నడ్డా వివరించారు. అర్వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పై నడ్డా విరుచుకుపడుతూ, ప్రస్తుత ప్రజా సంక్షేమ పథకాలపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలనూ దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు.

More Stories
పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్‌లో 17వ నంబర్ భవనం
ఢిల్లీ పేలుడు కిరాతక ఉగ్ర ఘాతుకం