గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు అతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు

గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు అతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు
భార‌త 76వ గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌ల‌కు ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా గురువారం ప్ర‌క‌టించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆహ్వానం మేర‌కు ఇండోనేషియా అధ్య‌క్షుడు రిప‌బ్లిక్ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతున్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలో ఇండియాలో ఇండోనేషియా ప్రెసిడెంట్ జ‌న‌వ‌రి 25, 26 తేదీల్లో  పర్యటించనున్నారు.
 
2024 అక్టోబర్ లో ప్ర‌బోవా సుబియాంటో ఇండోనేషియా అధ్య‌క్షుడిగా బాధ్య‌తలు స్వీక‌రించిన త‌ర్వాత‌ భార‌త్‌లో ఆయ‌న అడుగుపెట్ట‌డం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. ఈ పర్యటన రెండు దేశాల మ‌ధ్య‌ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుప‌రిచేందుకు దోహ‌ద ప‌డుతుంద‌ని తెలిపింది. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను చర్చించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. 
 
సుబియాంటో 2020లో ఇండోనేషియా రక్షణ మంత్రిగా న్యూఢిల్లీని సంద్శించారు. కాగా 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. 1952, 53, 66ల్లో మాత్ర‌మే విదేశీ అథితులు లేకుండా రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.
 
2024లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ముథ్య అతిథిగా రాగా,  2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎస్-సిసిని అతిథిగా వచ్చారు. 2021, 2022 సంవత్సరాల్లో కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు. అంతకుముందు 2020లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
2018లో ఆసియా దేశాలకు చెందిన 10 మంది నాయకులు వచ్చారు. 2017లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రాగా, 2016లో ఫ్రెంచ్ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2007లో పుతిన్(ర‌ష్యా), 2008లో నికోల‌స్ స‌ర్కోజీ(ఫ్రాన్స్) హాజ‌ర‌య్యారు.