
అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తీవ్ర ప్రతిగఘటనల అనంతరం యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో దక్షిణ కొరియా చరిత్రలో అరెస్టయిన తొలి అధ్యక్షుడిగా యోల్ నిలిచారు. అంతకుముందు బుధవారం తెల్లవారుజామున సియోల్‌లోని అధ్యక్ష భవనం వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
యోల్‌ను అరెస్టు చేసేందుకు 3 వేల మందికిపైగా పోలీసులతో యాంటీ కరెప్షన్ ఇన్వెస్టిగేటర్లు ఆయన అధికార నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని అధికార పార్టీకి చెందిన నాయకులు, యోల్ మద్దతుదారులు, వ్యక్తిగత సిబ్బంది, సైన్యం పోలీసులతోపాటు విచారణ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే తీవ్ర ప్రతిఘటనల నడుమ అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన అధికారులు యోల్‌ను అరెస్టు చేశారు.
ఓ ఎరుపు రంగు బస్సులో ఆయనను అక్కడి నుంచి తరలించారు. న్ని ఎక్కడి తీసుకెళ్లారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే యోల్‌ను గవాచియాన్‌లోని కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (సిఐఓ) కార్యాలయానికి తరలించే అవకాశం ఉన్నది. అక్కడ మార్షల్ లా విధింపు కేసులో విచారణ జరుపనున్నారు.
అరెస్టు వారెంట్ నేపథ్యంలో 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. డిసెంబర్ 3న దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై నేషనల్ అసెంబ్లీ 204-85 ఓట్లతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. మార్షల్ లాను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంటు జారీ అయింది.
ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు అధికారులు ఈ నెల 3 విఫల యత్నం చేశారు. తెల్లవారుజామునే అధ్యక్ష భవనానికి చేరుకున్న అధికారులను సైన్యంతోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. సుమారు ఆరు గంటల పాటు.. అధ్యక్షుడి భద్రతా సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. చివరకు అరెస్టును వాయిదా వేసుకున్న పోలీసులు వెనక్కి మళ్లారు.
అవినీతి నిరోధక సంస్థ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లే ముందు రికార్డ్ చేసిన వీడియో సందేశంలో, 64 ఏళ్ల యూన్, “ఈ దేశంలో చట్ట పాలన పూర్తిగా కూలిపోయింది” అని విచారం వ్యక్తం చేశారు. కానీ వామపక్ష ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా ఫ్లోర్ లీడర్ పార్క్ చాన్-డే ఇలా అన్నారు: “యూన్ అరెస్టు మన రాజ్యాంగ క్రమాన్ని పునరుద్ధరించడానికి మొదటి అడుగు. ఇది న్యాయం ఇంకా బతికే ఉందని నొక్కి చెబుతుంది.”
More Stories
చరిత్రలో తెలంగాణ విమోచనకు అత్యంత ప్రాముఖ్యత
సుంకాలతో సగం రొయ్యల ఎగుమతులు.. రూ 25,000 కోట్ల నష్టం
రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం