కేజ్రీవాల్‌పై ఈడీ విచారణకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

కేజ్రీవాల్‌పై ఈడీ విచారణకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ కు కేంద్రం షాకిచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆయన్ని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది.

కాగా, ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందుగా అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీ గత నెల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను అనుమతి కోరింది. ఈడీ అభ్యర్థనకు ఎల్జీ ఆమోదం తెలిపారు. 

దీంతో ఈ విషయాన్ని ఈడీ అధికారులు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లగా కేజ్రీని విచారించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక కేజ్రీవాల్‌తోపాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉపుఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను కూడా విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గతేడాది మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10 నుంచి జూన్‌ 1 వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్‌ మంజూరైంది. జూన్‌ 2న ఆయన మళ్లీ జైలులో లొంగిపోగా, జూన్‌ 20న ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ దక్కింది. 

బెయిల్‌ను ఈడీ సవాల్‌ చేయడంతో జూన్‌ 25న హైకోర్టు బెయిల్‌ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. జూన్‌ 26న ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. జూలై 12న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ సీబీఐ అప్పటికే అరెస్టు చేయడం వల్ల ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఇక సెప్టెంబర్‌ 13న సీబీఐ కేసులోనూ కేజ్రీకి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ దక్కడంతో ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆయన చివరికి సెప్టెంబర్‌ 14వ తేదీన తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులోనే ఈడీ మ‌రోసారి కేజ్రీవాల్‌ను విచారించేందుకు సిద్దమ‌వుతోంది.