దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  “మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరికీ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే అస్సాం రాష్ట్రంలో జరుపుకునే పంట పండుగ మాగ్ బిహు ప్రాముఖ్యతను గుర్తుచేశారు. ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సును పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

“నిన్న నేను మరపురాని సంక్రాంతి, పొంగల్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ పండుగ ఐక్యత బంధాలను బలపరుస్తుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను ఉత్సాహంతో, కృతజ్ఞతతో జరుపుకోవడానికి మనకు ఈ ఫెస్టివల్ స్ఫూర్తినిస్తుంది” అని పేర్కొన్నారు.

కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో సోమవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి కిషన్‌రెడ్డి దంపతులు, సినీనటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తదితరులు సాదర స్వాగతం పలికారు. 

  వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసికోటకు ప్రధాని పూజలు చేసిన అనంతరం భోగి మంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటికి, వాటిని ఆడించేవారికి సంప్రదాయ వస్త్రాలను బహూకరించారు. అందుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ  తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.