పసుపు బోర్డును ప్రారంభించిన పీయూష్ గోయల్

పసుపు బోర్డును ప్రారంభించిన పీయూష్ గోయల్
కేంద్ర వాణజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాదులో పసుపు బోర్డును మంగళవారం ఢిల్లీ నుండి  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా ప్రారంభిస్తూ పసుపు పంటను వ్యవసాయంలో బంగారంతో పోల్చారు. సంక్రాంతి రోజున నిజామాబాద్​లో పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందని చెప్పారు. 
 
ప్రపంచంలో భారత్‌కు గొప్ప పేరు ఉందని, నాణ్యమైన పంట పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని చెబుతూ  ప్రధాని మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు. తొలి ఛైర్మన్‌గా నియమితులైన గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయలతో సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు.
 
దేశవ్యాప్తంగా 30 రకాల పసుపు పంటలను సాగు చేస్తున్నారని, వాటికి జియెల్ ట్యాగ్  కూడా ఉందని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ముఖ్యమైన వెరైటీ పంట పెద్ద మొత్తంలో సాగు అవుతుందని, అందుకే బోర్డు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కొత్త వంగడాలపై పరిశోధనలు, పసుపు పంటకు వాల్యూ ఎడిషన్ చేసి ఎగుమతులు చేస్తామని తెలిపారు. 
 

అలాగే పసుపు ఉపయోగాలపై కూడా ప్రచారం చేయడం జరుగుతుందని, పంట దిగుబడి పెంచడం, సప్లై చైన్, మౌలిక వసతులు పెంపొందించడం, ఔషధ గుణాల నేపథ్యంలో ఫార్మా రంగంలో దీన్ని ఉపయోగించడం సహా అనేక అంశాల్లో రైతులకు బోర్డు నుంచి మద్దతు లభిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను శాలువా, పసుపు కొమ్ముల దండతో ఎంపీ ధర్మపురి అరవింద్ సత్కరించారు. సంక్రాంతి రోజు పసుపు రైతుల కలను నెరవేర్చిన నరేంద్ర మోదీకి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు.  పసుపు బోర్డు ఏర్పాటు కేవలం రైతులకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని చెబుతూ ఎగుమతులకు, స్టోరేజ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

పసుపు బోర్డు విషయంలో రైతాంగాన్ని చాలా రకాలుగా గత ప్రభుత్వాలు మోసం చేశాయని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి విమర్శించారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించారని గుర్తుచేశారు. పసుపు బోర్డు విషయంలో ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయని చెప్పారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంపీ అరవింద్ కృషి మరువలేనిదని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో  కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,  బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు రైతులు పాల్గొన్నారు. తాను ఎంపిగా గెలిస్తే నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని 2019 ఎన్నికల్లో ఎంపి అరవింద్ ఇచ్చిన మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.