
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కోలాహలం నెలకొంది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల కాగా17వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. గడువు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో నామినేషన్లు జోరందుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్ మంగళవారం కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
వాస్తవానికి అతిషి సోమవారం నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. కానీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోలేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. దాంతో ఇవాళ ఉదయాన్నే ఆమె నామినేషన్ వేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్ అతిషి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్ దాఖలు చేయాలని భావించిన అతిషి ఉదయం కల్కాజీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాతో కలిసి కల్కాజీలో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లగా అప్పటికే సమయం మించిపోయింది. దాంతో ఆమె నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం అతిషిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. అతిషి తన వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించారని కల్కాజీ నియోజకవర్గ వాసి అయిన కేఎస్ దుగ్గల్ గోవింద్‌పురి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
అతిషి వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చిన సౌత్ ఈస్ట్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంజయ్ కుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులను ఆదేశించారు. అతిషి ప్రభుత్వ వాహనంలో కల్కాజీ ఆప్ కార్యాలయానికి ఎన్నికల సామాగ్రి తెప్పించినట్లు కేఎస్ దుగ్గల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం