హ‌త‌మైన ఉగ్ర‌వాదుల్లో 60 శాతం మంది పాకిస్తానీయులే

హ‌త‌మైన ఉగ్ర‌వాదుల్లో 60 శాతం మంది పాకిస్తానీయులే
గ‌తేడాది హ‌త‌మైన ఉగ్ర‌వాదుల్లో 60 శాతం మంది పాకిస్తాన్ సంత‌తికి చెందిన వారేన‌ని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. హింస‌ను ప్రేరేపించేందుకు పాకిస్తాన్ పాత్ర ఏంటో ఈ చ‌ర్య‌తో తెలిసి పోతుంద‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 15వ తేదీన ఆర్మీ డే సంద‌ర్భంగా ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్‌లోని ఉగ్ర‌వాదులు జమ్మూక‌శ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తున్నార‌ని తెలిపారు. 
 
ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను నిరోధించేందుకు గ‌తేడాది 15 వేల మంది సైనికుల‌ను చేర్చుకుకోవ‌డంతో ఎంతో దోహ‌ద‌ప‌డింద‌ని పేర్కొన్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ర్యాట‌కం అభివృద్ధి చెందుతున్న స‌మ‌యంలోనే ఉగ్ర‌వాదులు త‌మ చ‌ర్య‌ల‌ను వేగం చేశారు.  ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో చురుకుగా ఉన్న ఉగ్రవాదుల్లో 80 శాతం మంది పాక్ నుంచే వచ్చారని తెలిపారు.
 
చైనాతో సరిహద్దులు పంచుకున్న వాస్తవాధీ రేఖ వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నా స్థిరంగా ఉందని జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఇరువైపుల పలు విడతలు చర్చలు సైతం జరిగినట్టు చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో డెప్సాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ మొదలైందని తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి ఇరువైపు బలగాలు డెస్పాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ జరుపుతున్నాయని, ఒకరి ప్రాంతాల వైపు మరొకరు వెళ్లడం ఆగిందని చెప్పారు. 
 
పెట్రోలింగ్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఇరువైపుల అధికారుల మధ్య రెండు రౌండ్ల చర్చలు కూడా పూర్తయ్యాయని, ఉభయ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని చెప్పారు. గ్రేజింగ్ గ్రౌండ్‌కు సంబంధించి పరస్పరం అంగీకారం ఉందని, బఫర్ జోన్‌ అనేదేమీ లేదని చెప్పారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సమయంలో చర్చల ప్రకారం కొన్ని ప్రాంతాలను ”టెంపరరీ మారటోరియం”గా ప్రకటించారని పేర్కొన్నారు. 
 
ఉమ్మడి ప్రాంతాలకు దూరంగా సంయమనం పాటించడం వల్ల ఘర్షణల స్థాయి పెరగకుండా ఉండేందుకు వీలుంటుందని చెప్పారు. ప్రశాంత పరిస్థితిని నెలకొనేందుకు, పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ఇరుదేశాల మధ్య విస్తృత అవగాహన అవసరమని చెబుతూ ఏప్రిల్ 20 తర్వాత పరస్పర విశ్వాసానికి ఇరుదేశాలు కొత్త నిర్వచనం ఇచ్చాయని తెలిపారు. 
 
కలిసి కూర్చుని చర్చించుకోవడం ద్వారా పరస్పర విశాంత మరింత పెరుగుతుందని పేర్కొంటూ తదుపరి జరిగే ప్రత్యేక ప్రతినిధుల సమావేశం కోసం తాము ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. కాగా, బంగ్లాదే‌శ్‌తో పరిస్థితిపై ద్వివేది మాట్లాడుతూ, భారతదేశం వ్యూహాత్మకంగా తమకు కీలకమని బంగ్లాదేశ్ చీఫ్ ఇటీవల మాట్లాడరని, భారత్‌ విషయం కూడా అంతేనని ద్వివేది చెప్పారు. 
 
ఇరుగుపొరుగు దేశాలైనందున కలిసి బతకాలని, ఒకరినొకరు అర్ధం చేసుకోవాలని, శత్రుత్వం ఎవరికీ మంచిది కాదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే ఎటువైపు నుంచి ఇబ్బందులు లేవని, బంగ్లాదేశ్ చీఫ్‌తో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. నవంబర్‌లో కూడా వీడియో కన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని, ఎన్‌డీసీ కోసం మన ఆఫీసర్లు కూడా అక్కడకు వెళ్లారని చెప్పారు.
 
 సంయుక్త విన్యాసాల విషయం మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేశామని తెలిపారు. ఇప్పటికైతే ఇరుదేశాల మిలటరీ సంబంధాలు సజావుగా ఉన్నట్టు వెల్లడించారు. సరిహ‌ద్దుల్లో ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. స‌రిహద్దుల్లో మౌలిక స‌దుపాయాలు పెంచ‌డం, కెప‌బిలిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌పై దృష్టి సారించామ‌ని తెలిపారు. చొర‌బాటు ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకుంటున్నామ‌ని ఆర్మీ చీఫ్ స్ప‌ష్టం చేశారు.