సోన్‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సోన్‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జమ్ముకశ్మీర్‌ లోని సోన్‌మార్గ్‌ ప్రాంతంలో జడ్‌ మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. ప్రధాని రాక నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టన్నెల్ ప్రారంభోత్సవంలో జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీనగర్‌ నుంచి కార్గిల్‌ వెళ్లే దారిలో శ్రీనగర్‌- లేహ్‌ జాతీయ రహదారిపై ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఈ టన్నెల్‌ నిర్మాణం కోసం ఏకంగా రూ.2,680 కోట్లు ఖర్చు చేశారు. భారత రక్షణ రంగానికి వ్యూహాత్మకంగా ఈ టన్నెల్‌ చాలా కీలకం కానుంది. ఈ జడ్‌ మోడ్‌ సొరంగం 6.5 కిలోమీటర్ల పొడవు ఉంది.  ఈ టన్నెల్‌ ద్వారా ఏ సీజన్‌లోనైనా లడఖ్‌కు చేరుకోవడానికి వీలవుతుంది.

టన్నెల్‌కు సంబంధించి 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి. ఈ జెడ్ మోడ్ టన్నెల్‌ భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. దాదాపు సముద్రమట్టానికి 8,500 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు.  అత్యంత శీతలమైన లడఖ్‌ను ఏ సీజన్‌లో అయినా సందర్శించేందుకు ఈ టన్నెల్‌ ఉపయోగపడనుంది.

ఈ సొరంగం రవాణా వ్యవస్థతోపాటు రక్షణ వ్యవస్థకు కూడా కీలకం కానుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి టన్నెల్ ద్వారా వెళ్లొచ్చు. జమ్ముకశ్మీర్‌లో ‘జడ్‌ మోడ్‌’ టన్నెల్‌ ఏర్పాటుతో కార్గిల్ మరింత సురక్షితంగా మారింది. గతంలో కార్గిల్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడగా భారత్ ఏకంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది.

శీతాకాలంలో తీవ్రంగా మంచు కురిసే సమయాన్ని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు భద్రతాబలగాలపై దాడులకు తెగబడ్డారు. అప్పట్లో కార్గిల్ ప్రాంతం పాకిస్థాన్‌ ఉగ్రవాదుల హస్తగతమైతే శ్రీనగర్– లేహ్ మధ్య రాకపోకలు నిలిచిపోయేవి. ఇప్పుడు సొరంగం ద్వారా సైన్యం కార్గిల్‌కు వేగంగా చేరుకునే అవకాశం ఉంది. టన్నెల్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న పలువురు కార్మికులతో మోదీ ముచ్చటించారు. ఈ ప్రాజెక్టుపై పనిచేసిన అధికారులతోనూ ప్రధాని సంభాషించారు.

జమ్ముకశ్మీర్‌లోని బాల్తల్ గ్రామం నుంచి కార్గిల్ జిల్లాలోని డ్రాస్ పట్టణం వరకు 31 కి.మీ విస్తీర్ణంలో, 18 కి.మీ అప్రోచ్ రోడ్‌తో జోజిలా టన్నెల్ ప్రాజెక్టు ఉంటుంది. దీని పూర్తి పనులు 2030 సంవత్సరం నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.

ఏటా చలికాలంలో కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం సోన్​మార్గ్‌‌కు మంచుతో దారి మూసుకుపోతుంటుంది. ఇకపై ఆ సమస్య ఉండదు. ఎందుకంటే జెడ్- మోడ్​ టన్నెల్ మీదుగా ప్రయాణించి శ్రీనగర్- లద్ధాఖ్ హైవేపై ఉన్న సోన్​మార్గ్‌‌కు పర్యటకులు నేరుగా చేరుకోవచ్చు. అంటే పర్యటకంగానూ ఇది మన దేశానికి చాలా ఉపయోగపడుతుంది. గండేర్బల్ జిల్లాలోని కాంగన్ పట్టణానికి సైతం ఈ టన్నెల్ ప్రధాన మార్గంగా మారనుంది.