
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంభం సభ్యులు తెలిపారు. మందా జగన్నాథం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, ప్రస్తుత ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో పెద్దపుల్లయ్య- మంద సవారమ్మ దంపతులకు 1951 మే 22వ తేదీన మందా జగన్నాథం జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం వైద్య వృత్తిలో కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుంచి పోటీచేసి నాగర్‌కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగారు. తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2014 మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీ పదవిని త్యాగం చేశారు. ఆయన సేవలను గుర్తించిన కేసీఆర్ ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో రెండుసార్లు అవకాశం కల్పించారు.
మందా జగన్నాథంకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని, జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటని ఆయన సంతాపం తెలిపారు.
జగన్నాథం మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్నాథం కృషి, పార్టీకి వారు అందిన సేవలను బీఆర్‌ఎస్ అధినేత గుర్తుచేసుకున్నారు. బిజెపి ఎంపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు జగన్నాథం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత