
ఆదిలాబాద్-నిజామాబాద్- కరీంనగర్ – మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గత ఎన్నికలో పార్టీ అభ్యర్థిని నిలపని గులాబీ పార్టీ ఈ సారి ఏం చేస్తుందన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. కొందరు ఆశవహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నాయకత్వాన్ని కోరుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. అందులో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు కాగా ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం ఉంది. ఆదిలాబాద్ – నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి కూడా పదవీ విరమణ చేసే వారిలో ఉన్నారు. దానితో శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.
ఆదిలాబాద్ – నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రఘోత్తమ్ రెడ్డి, వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నర్సిరెడ్డి పదవీ విరమణ చేసే వారిలో ఉన్నారు. దీంతో ఆ స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ద్వైవార్షిక ఎన్నికలను నిర్వహించనుంది. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను కూడా ఈసీ ప్రకటించింది.
మరి ఈ దఫా ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ కోసం ఆశావహులు ప్రయత్నాలు చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టీఎస్టీఎస్ మాజీ ఛైర్మన్ చిరుమల్ల రాకేష్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత రాజారాం యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన చంటి రాహుల్, తదితరుల పేర్లు ప్రచారంలో వినిపించాయి. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న వారిని ఓటర్లుగా నమోదు చేయించారు
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ ఎన్నికలను ఉపయోగించుకున్నారని చెప్పడం ద్వారా ఈ ఎన్నికలలో పోటీకి కేటీఆర్ విముఖత వ్యక్తం చేయడం గమనార్హం.
More Stories
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో కీలక నివేదిక
భారత్-యూకే ఒప్పందం భారత్ అభివృద్ధికి లాంచ్ ప్యాడ్
`దున్నపోతు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాటలు