సంక్రాంతికి పల్లె బాట పట్టిన హైదరాబాద్ వాసులు

సంక్రాంతికి పల్లె బాట పట్టిన హైదరాబాద్ వాసులు
సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణ‌వాసులంద‌రూ ప‌ల్లెబాట ప‌ట్టారు.  ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు వరస సెలవులు రావడంతో పండగను తమ సొంతూళ్లలో జరుపుకునేందుకు పట్టణం విడిచి పల్లెకు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజలంతా చౌటుప్పల్ మీదుగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్లాల్సి ఉండడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. 
 
ప్రజలు తమ స్తోమతను బట్టి ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు ఇతర వాహనాల్లో స్వగ్రామాలకు బయలు దేరారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి విజ‌య‌వాడ‌, కర్నూల్, త‌మిళ‌నాడు వెళ్లే ర‌హ‌దారుల‌న్నీ వాహ‌నాల‌తో కిక్కిరిసిపోయాయి. 
 
ప్ర‌ధానంగా హైద‌రాబాద్ – విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాల ర‌ద్దీ కొన‌సాగుతోంది. చౌటుప్ప‌ల్ మండ‌లంలోని పంతంగి టోల్ ప్లాజా వ‌ద్ద వాహ‌నాలు నెమ్మెదిగా క‌దులుతున్నాయి. తుప్రాన్‌పేట నుంచి పంతంగి టోల్ ప్లాజా వ‌ర‌కు వాహ‌నాలు నిలిచిపోయాయి. ఆందోల్ మైస‌మ్మ‌, చౌటుప్ప‌ల్‌లో వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దులుతున్నాయి. ట్రాఫిక్‌ను పోలీసులు క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తున్నారు.
 
హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను 11 టోల్ గేట్ల ద్వారా టోల్ సిబ్బంది అనుమ‌తిస్తున్నారు. శుక్ర‌, శ‌నివారం రెండు రోజుల్లో టోల్ ప్లాజా నుంచి ఏపీ వైపున‌కు 1,43,000 వాహ‌నాలు త‌ర‌లివెళ్లాయి. రైళ్ల‌ల్లో రిజ‌ర్వేష‌న్ దొర‌క్క‌పోవ‌డం, ప్ర‌యివేటు బ‌స్సుల్లో ఛార్జీలు భారీగా ఉండ‌డంతో చాలా మంది సొంత వాహ‌నాలు, బైక్‌ల‌పైనే సొంతూళ్ల‌కు వెళ్తున్నారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి పల్లెలకు ప్రజలు భారీగా కదలివెళ్తున్నారు. సికింద్రాబాద్‌, జేబీఎస్, ఎంజీబీఎస్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పండుగపూట స్వగ్రామాలకు వెళ్దామంటే చాలీచాలని బస్సులు, రైళ్లలో సీట్లు దొరక్క అవస్థలు తప్పడం లేదని జనం వాపోయారు.

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్‌లోని ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ తోపాటు కూకట్‌పల్లి, ఆరాంఘర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్, ఎల్బీనగర్‌ కూడలి, వనస్థలిపురం, హయత్‌నగర్‌ వద్ద వాహనాల రద్దీ నెలకొంది.  ప్రధానంగా ఏపీకి వెళ్లే రోడ్లపై రద్దీ కనిపిస్తుండగా సంక్రాంతి పండగ కోసం దాదాపు 6 వేల 432 బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. వాహనాలు భారీగా తరలివెళ్లడంతో నగరం దాటేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది.

రాష్ట్రంలో రెండో ప్రధాననగరం వరంగల్‌లోనూ రద్దీ నెలకొంది పండగరద్దీతో హనుమకొండ బస్టాండ్‌ జనంసంద్రంగా మారింది. ఏకశిలా నగరం నుంచి సమీపంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు సరిపడా బస్సులు లేక గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. రద్దీకి సరిపడా బస్సులు నడపకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు .

రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. జనంరద్దీదృష్ట్యా రైల్వేశాఖ పలుప్రాంతాలకి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. హైదరాబాద్‌ మెట్రో రైళ్లలోనూ రద్దీ కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించారు. 

హైదరాబాద్‌ నుంచి విజయవాడ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వెళ్లే వారు ఎక్కువ మంది రైళ్లలో సీట్లు దొరక్క అవస్థలు పడ్డారు. ప్రత్యేక రైళ్లలో అన్‌రిజర్వుడ్‌ సీట్లు ఎక్కువగా ఉంటే ఉపయోకరమని చెబుతున్నారు. ప్రత్యేక సర్వీసుల్లోనూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.