
అమెరికా వాణిజ్య విధానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదిత సుంకాలు, పన్నుల పెంపు, నియంత్రణ నిబంధనలను అమల్లోకి వస్తే ఆర్ధిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆమె హెచ్చరించారు.
శనివారం ఆమె ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయంగా స్థిరంగా అభివృద్ధి కొనసాగుతున్నప్పటికీ 2024-25లో భారత వృద్ధి రేటు స్వల్పంగా బలహీన పడవచ్చునని పేర్కొన్నారు. జిడిపి బలహీన పడటానికి కారణాలేమీ జార్జివా వివరించలేదు. దీనిపై మరిన్ని వివరాలను ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై రాబోయే నివేదికలో పొందుపర్చుతామని తెలిపారు.
ప్రాంతీయంగా విభేదాలు ఉన్నా, గ్లోబల్ వృద్ధిరేటు నికరంగా ఉంటుదని చెబుతూ ఐఎంఎఫ్ వరల్డ్ ఎకానమీ ఔట్‌లుక్ ప్రకారం అమెరికా వద్ధిరేటు అంచనాలకన్నా మెరుగ్గా ఉంటుందని ఆమె చెప్పారు. యూరోపియన్ యూనియన్ అభివృద్ధి నిలిచిపోవచ్చని, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థపై అధిక ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుందని ఆమె తెలిపారు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థ చైనాలో ప్రతికూల ద్రవ్యోల్బణం నెలకొందని తెలిపారు.
దేశీయంగా డిమాండ్లకు సవాళ్లు ఎదురవుతాయని చెబుతూ అన్ని రకాల చర్యలు తీసుకున్నా తక్కువ ఆదాయ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం అమలు చేసే సుంకాలు, పన్నులు, నియంత్రణ నిబంధనలను అమల్లోకి తెస్తే మరింత ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై అదనపు సుంకాలను విధించే ప్రణాళికలను డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. జనవరి 20న ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుంకాలను పెంచాలనేది ఆయన ప్రధాన ఉద్దేశ్యంగా బహిరంగంగా ప్రకటించారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను మరింత పెంచుతుందని ఆమె తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ సరఫరా వ్యవస్థపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు అనిశ్చితికి గురవుతాయని జార్జివా వివరించారు. ప్రస్తుత ఏడాది 2025లో భారత జిడిపి 6.6 శాతానికి మందగించే అవకాశాలున్నాయని ఇంతక్రితం రోజు ఐక్యరాజ్య సమితి పేర్కొన్న విషయం తెలిసిందే. 2024లో 6.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. వచ్చే 2026లోనూ 6.7 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది.
ప్రపంచ వృద్ది రేటులోనూ స్తబ్దత చోటు చేసుకోవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది 2025లో ప్రపంచ వృద్ధి రేటు 2.8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఇప్పటికీ అనిశ్చితి పెద్ద ఎత్తున ఉందని తెలిపింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, పెరిగిన రుణ వ్యయాల నుండి వచ్చే ప్రమాదాలు పొంచి ఉన్నాయని విశ్లేషించింది.
ఈ సవాళ్లు ముఖ్యంగా తక్కువ ఆదాయం, దుర్బల దేశాలపై తీవ్ర ప్రతికూలతను చూపనున్నాయని విశ్లేషించింది. ఈ పరిణామాలు ప్రపంచ అభివృద్ధి పురోగతిని దెబ్బతీయనున్నాయని హెచ్చరించింది.
More Stories
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం