ఢిల్లీలో ప్రణబ్‌ స్మారక స్థూపం

ఢిల్లీలో ప్రణబ్‌ స్మారక స్థూపం
దివంగత రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్‌ ముఖర్జీ స్మారక స్థూపాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్‌ఘాట్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో దీన్ని నెలకొల్పనుంది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ కేంద్ర గృహనిర్మాణ-పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తనకు లేఖ పంపారని ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ఠ తెలిపారు. 
 
అనూహ్యంగా ఈ కృప లభించిందని పేర్కొంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ప్రణబ్‌ చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేకంగా భేటీ కాలేదంటూ ఇటీవల శర్మిష్ఠ విమర్శలు చేయడం గమనార్హం. ఇందుకోసం రాజ్‌ఘాట్ ఆవరణలోని ‘రాష్ట్రీయ స్మృతి’ కాంప్లెక్స్‌లో ఒక స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
 
 కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రణబ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ గౌరవాన్ని చాటుకున్నారని ఆమె కొనియాడారు.

 
“బాబా (ప్రణబ్) స్మారకం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వయంగా మేము కోరకపోయినా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయడం ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతుంది. ఊహించని విధంగా తీసుకున్న ఈ నిర్ణయం మా మనసులను కదిలించింది” అని ఒక ట్వీట్‌లో షర్టిష్ట ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ గౌరవాలను అడిగి తీసుకోరాదని, వాటంతటవే వరించి రావాలని బాబా (ప్రణబ్) చెప్పేవారని, బాబా జ్ఞాపకాలను గౌరవిస్తూ ముందుకు వచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని షర్మిష్ట చెప్పారు. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ వెటరన్ నేత ప్రణబ్ ముఖర్జీ కేంద్రంలో పలు మంత్రి పదవులు చేపట్టడం తో పాటు భారతదేశ 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని చేపట్టారు. 84 ఏళ్ల వయస్సులో 2020 ఆగస్టు 31న ఆయన కన్నుమూశారు.