రష్యా బెటాలియన్ మొత్తాన్ని సర్వనాశనం చేశాం

రష్యా బెటాలియన్ మొత్తాన్ని సర్వనాశనం చేశాం

రష్యా భూభాగమైన కస్క్‌ రీజియన్‌లో మాస్కో కీవ్‌ సైన్యాల మధ్య పోరు తీవ్రమైంది. ఇన్నిరోజులు వేలమంది సైనికులను పోగొట్టుకున్న జెలెన్‌స్కీ బలగాలు, తాజాగా పుతిన్‌ సైన్యాన్ని భారీ దెబ్బకొట్టినట్లు తెలిసింది. గడిచిన రెండు రోజుల్లో ఆ ప్రాంతాల్లో మోహరించిన రష్యన్‌ పదాతిదళం బెటాలియన్‌ మొత్తాన్ని అంతమొందించినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ తెలిపారు. 

రష్యన్‌ సైన్యానికి మద్దతుగా పోరాడుతున్న ఉత్తరకొరియా సైనికులు కూడా భారీగా చనిపోయినట్లు ప్రకటించారు. పొక్రోస్క్‌ ప్రాంతంలో ప్రస్తుతం యుద్ధం తీవ్రంగా సాగుతోందని వెల్లడించారు. ఖార్కీవ్‌, సుమీ రీజియన్లలోని గ్రామాలపై గైడెడ్‌ ఏరియల్‌ బాంబులను రష్యా ప్రయోగిస్తోందని ఆరోపించారు.

మరోవైపు కస్క్‌ రీజియన్‌లో గత 24 గంటల్లో 540 మంది కీవ్‌ సైనికులను హతమార్చాయని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌ ప్రయోగించిన 8 అమెరికన్‌ క్షిపణులు, 72 డ్రోన్లను తమ గగనతల వ్యవస్థ కూల్చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌ సైనిక ఎయిర్‌పోర్టులు, డ్రోన్‌ అసెంబ్లింగ్‌ కేంద్రాలు, ఆయుధ గిడ్డంగులను దెబ్బతీసినట్లు మాస్కో వివరించింది.

రష్యా చెరలో ఉన్న 1358 మంది ఉక్రెయిన్‌ సైనికులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామని శనివారం జెలెన్‌స్క్రీ ఎక్స్‌ వేదికగా తెలిపారు. తన సైన్యం రష్యాపై విజయపరంపరలు కొనసాగిస్తోందని తెలిపారు. 2022 ప్రారంభం నుంచి రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నడుస్తోంది. 

ఈ ఘర్షణల నేపథ్యంలో కీవ్‌లో 39,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడమో, గాయపడటమో జరిగిందని ఐరాసలోని ఉక్రెయిన్‌ మానవతావాద సమన్వయకర్త మథియాస్‌ ష్మాలే గతంలో పేర్కొన్నారు. అంతేకాక 3,400 కంటే ఎక్కువ పాఠశాలలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని తెలిపారు. 10 మిలియన్ల మంది పౌరులు తమ ఇళ్లను వీడినట్లు వెల్లడించారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఉత్తరకొరియా సైనికులు మాస్కో తరఫున పోరాడుతున్నారు. తొలుత వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించి రంగంలోకి దింపారు. కీవ్‌ బలగాల చేతుల్లో హతమవుతున్నారని తాజాగా జెలెన్ స్కీ తెలిపారు.