బిజెపి నేత మాధవీలతకు జేసీ క్షమాపణ

బిజెపి నేత మాధవీలతకు జేసీ క్షమాపణ
సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మధ్య వివాదం ముగిసిపోయింది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎట్టకేలకు తగ్గి మాధవీలతకు బహిరంగంగా క్షిపణ చెప్పారు. ఏదో పెద్దోడినని.. ఆవేశంలో అలా అన్నానని తెలిపారు. అలా మాట్లాడటం తప్పేనని క్షమాపణలు కోరారు. తాడిపత్రిలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ తన వయసు 72 సంవత్సరాలు అని.. ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని వివరించారు. ఎవరి బతుకుదెరువు వారిదేనని పేర్కొన్నారు. 

మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. మాధవీలతను క్షమాపణలు కోరారు. తనను పార్టీ మారిపోవాలని కొంతమంది విమర్శిస్తున్నారని చెబుతూ తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులు అందరూ ఫ్లెక్సీ గాళ్లేనని విమర్శించారు.

డిసెంబర్‌ 31వ తేదీన జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో 16వేల మంది అక్కాచెల్లెళ్లు పాల్గొన్నారని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. తాడిపత్రి ప్రజలు తన వెంటే ఉన్నారని, గత మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తాడిపత్రి కోసం ఎంతదూరమైనా వెళ్తానని, రెండేళ్లలోనే తాడిపత్రి రూపురేఖలు మార్చేస్తానని తెలిపారు.

తాడిపత్రిలోని జేసీ పార్కులో మహిళల కోసం ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకలకు వెళ్లవద్దని మాధవీలత పిలుపునిచ్చారు. అక్కడ గంజాయి బ్యాచ్‌లు ఉంటాయని.. మహిళలపై వాళ్లు దాడి చేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. 

దీనిపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాధవీ లతపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మాధవీలత ఒక సినిమా యాక్టర్‌ అని.. యాక్టర్స్‌ అంతా ప్రాస్టిట్యూట్స్‌నే అని పరుష పదజాలంతో విమర్శించారు. జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగు చర్య తీసుకోవాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.