ఆర్మీ వాహనం లోయలో పడి నలుగురు జవాన్లు మృతి

ఆర్మీ వాహనం లోయలో పడి నలుగురు జవాన్లు మృతి

జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బందిపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.  శనివారం ఉదయం సైనికులతో వెళ్తున్న వాహనం ఎస్‌కే పయీన్ ప్రాంతంలో మలుపు తిరుగుతుండగా డ్రైవర్‌ వాహన నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై నుంచి జారి కిందనే ఉన్న లోయలో పడింది.

అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు జారుడుగా ఉండటంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని అధికారులు తెలిపారు. ఇద్దరు అక్కడే మృతి చెందగా,  ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు చెప్పారు.

కాగా, గతేడాది డిసెంబర్‌ 24వ తేదీన పూంచ్‌ జిల్లాలో ఆర్మీ వాహనం అదుపుతప్పి 350 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ఉగ్రకోణం లేదని ఆర్మీ స్పష్టం చేసింది. అంతకుముందు నవంబర్‌ 4న రాజౌరి జిల్లాలో వాహనం స్కిడ్‌ అయి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆర్మీ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు.