ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంత మంది గాయపడినట్లు సమాచారం. అయితే భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.  సంఘటన స్థలంలో భద్రతా దళాలు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌ను గరియాబంద్ జిల్లా ఎస్పీ ఎస్.పీ.నిఖిల్ రఖేచా ధృవీకరించారు.

మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గరియాబంద్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రత బలగాలనకు సమాచారం అందింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని మావోయిస్టులు పసిగట్టారు. దాంతో భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. ఆ వెంటనే భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. 

ఈ నేపథ్యంలో కొన్ని గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ కొనసాగింది. అయితే ఈ కాల్పుల్లో మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఎదుట 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో తారక్క సైతం ఉన్నారు.

దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 2026, మార్చి నాటికి భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. ఆ క్రమంలో ఆపరేషన్ కగార్‌కు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో మావోయిస్టులకు షెల్టర్‌ జోన్‌గా ఉన్న దండకారణ్యంలో కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో ఛత్తీస్‌గఢ్‌లో పలు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించారు.ఇక పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది రోజులకే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే.