కొత్త ‘చైనా’ వైరస్‌తో భయపడాల్సిన అవసరం లేదు

కొత్త ‘చైనా’ వైరస్‌తో భయపడాల్సిన అవసరం లేదు

చైనాలో మరో వైరస్ వ్యాప్తి చెందుతోందని, ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వస్తున్న కథనాలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెల్త్‌ ఏజెన్సీ డీజీహెచ్‌ఎస్‌ స్పందించింది. హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీజీహెచ్‌ఎస్‌ ఉన్నతాధికారి డాక్టర్‌ అతుల్‌ గోయల్‌ స్పష్టం చేశారు. 

శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. “చైనాలో హెచ్ఎమ్పివి వ్యాప్తి గురించి వార్తలు రావడం వాస్తవమే అయినప్పటికీ, మేము దీనిని అంతే తీవ్రమైనదిగా చూడడం లేదు. ఇది ఎక్కువగా పెద్దలు, 1 ఏళ్లలోపు చిన్న పిల్లల్లో ఫ్లూ వంటి లక్షణాలు కలిగించే ఇతర శ్వాసకోశ వైరస్‌లా ఉంటుంది,” అని గోయల్ వివరించారు.

“మన దేశంలో శ్వాసకోశ సంబంధిత వైరస్‌ల వ్యాప్తికి సంబంధించిన డేటాను విశ్లేషించాం. డిసెంబర్‌ వరకు ఉన్న డేటాలో గణనీయమైన మార్పులేమీ లేవు. మా సంస్థల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నమోదైన కేసులేవీ రాలేదు” అని తెలిపారు.

శీతాకాలంలో శ్వాసకోశ వైరస్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకోసం సాధారణంగా ఆస్పత్రులు ఇతర సామగ్రి, పడకలను సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రజలకు చెప్పేదేంటంటే అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నియంత్రణకు సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే అలాంటి వ్యక్తులు ఎక్కువ మందితో కలవడం మంచిది కాదు. తద్వారా ఇన్ఫెక్షన్‌ వ్యాప్తికి అవకాశం ఉండదు.

 మామూలుగా దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు రుమాలు లేదా టవల్‌ను అడ్డుగా పెట్టుకోండి. జలుబు, జ్వరం ఉంటే అవసరమైన మందులు తీసుకోండి. ఇప్పుడున్న పరిస్థితి గురించి మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సి డి సి) దేశంలో శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెట్టి, కాలానుగుణ ఇన్ఫ్లుఎంజా కేసులను పర్యవేక్షిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. చైనాలో హెచ్ఎమ్పివి వ్యాప్తి గురించి అధికారికంగా నిర్ధారించబడిన సమాచారం లేదు, కానీ ఎన్సిడిసి అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపింది.

నివారణ మార్గాలు!

  • చిన్నపాటి ముందుజాగ్రత్త చర్యలతో ఈ వైరస్ దరిచేరకుండా చూసుకోవచ్చు.
  • సబ్బుతో 20 సెకండ్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి
  • శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి
  • వైరస్ బారినపడిన వ్యక్తులకు దూరం పాటించాలి
  • తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రం చేసుకోవాలి
  • వైరస్ బారినపడినవారు దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి
  • ఆ వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూసుకోవాలి
  • లక్షణాలు కనిపిస్తున్నప్పుడు నలుగురిలోకి వెళ్లడం కంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దానివల్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్తున్నారు.