లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా స్థావరాలపై భారత్ అభ్యంతరం

లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా స్థావరాలపై భారత్ అభ్యంతరం

భారత్- చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని అనుకున్న ప్రతీసారి మళ్లీ ఏదో ఒక అంశం  రెండు దేశాల మధ్య అగ్గిని రాజేస్తోంది. 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యం మధ్య జరిగిన తలెత్తిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇదే విషయంపై అనేక దఫాలుగా సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. 

ఇటీవల ఆ చర్చలు పూర్తి కాగా సరిహద్దుల్లో మోహరించిన సైన్యాలు, ఆయుధాలను వెనక్కి మళ్లించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలోనే రెండు వైపులా బలగాలు వెనక్కి వెళ్లినట్లు రెండు దేశాలు ప్రకటించాయి. దీంతో నాలుగున్నర ఏళ్ల నాటి సమస్య తీరిపోయి రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గిందని భావించే లోపు భారత్‌కు మరోసారి చైనా తలనొప్పిగా మారింది.

లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతంలో చైనా రెండు స్థావరాలను ఏర్పాటు చేసినట్లు భారత్ గుర్తించింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో చైనా ఆక్రమణలను ఎప్పటికీ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి చట్ట విరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలు చేయడం వల్ల ఆ ఆక్రమణలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

“చైనా అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. చైనా హోటాన్ ప్రిఫెక్చర్లో రెండు కొత్త కౌంటీల ఏర్పాటు గురించి చేసిన ప్రకటనను గమనించాం. ఈ కౌంటీల పరిధిలో ని కొన్ని భాగాలు భారత కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ పరిధిలో ఉన్నాయి” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

తూర్పు లడక్ లోని డెంచోక్,  డెప్సాంగ్ ప్రాంతాల్లో ఉపసంహరణ తర్వాత కొన్ని నెలల వ్యవధిలో ఈ చర్య జరిగిందని చెప్పారు. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా ప్రణాళిక ప్రకటించిన నేపథ్యంలో, భారత ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని న్యూఢిల్లీ పేర్కొంది. “నదులపై ఉన్న మేగా ప్రాజెక్టుల విషయంలో, దిగువ రాష్ట్రాలపై ప్రభావం చెందకుండా ఉండేందుకు పారదర్శకత మరియు సంప్రదింపుల అవసరాన్ని చైనాకు తెలియజేశాం” అని జైస్వాల్ వివరించారు.

ఇక ఇదే లడఖ్‌లో ఆక్రమణల అంశంపై దౌత్యమార్గాల ద్వారా చైనాకు తమ నిరసన ఇప్పటికే వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.  చైనాలోని హోటాన్‌ ప్రాంతం లడఖ్‌కు సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హోటన్ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన చూసినట్లు రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. 

ఈ రెండు కౌంటీల్లోని కొంత భాగం లడఖ్‌ పరిధిలోకి వస్తుందని, ఈ ప్రాంతంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినట్లు వెల్లడించారు. అయితే దీన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించదని తేల్చి చెప్పారు. ఈ కొత్త కౌంటీల ఏర్పాటు అనేది లడఖ్ ప్రాంతంలో భారత్‌కు దీర్ఘకాలంగా, స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ఇలా చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించడం చట్టబద్ధత లభించదని రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు.

భూటాన్ భూభాగంలో భాగంగా ఉన్న ప్రాంతాల్లో, గత ఎనిమిదేళ్లలో చైనా కనీసం 22 గ్రామాలు మరియు స్థావరాలను నిర్మించిందని డిసెంబర్ 18న ఓ నివేదిక వెల్లడించింది. 2020 నుండి డోక్లామ్ ప్రాంతానికి సమీపంలోని ప్రాంతాల్లో ఎనిమిది గ్రామాలు నిర్మించబడినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపించాయి.