ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి అరెస్టుకు ప్ర‌య‌త్నం విఫ‌లం

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి అరెస్టుకు ప్ర‌య‌త్నం విఫ‌లం
అభిసంశనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌యోల్‌ను అరెస్టు చేసేందుకు ఆ దేశ అవినీతి వ్యతిరేక దర్యాప్తు బృందం-సీఐఓ ప్రయత్నించి విఫలమైంది. సెంట్రల్‌ సియోల్‌లోని దేశ అధ్యక్షుడి నివాసంలోకి 150 మంది అత్యున్నత దర్యాప్తు అధికారులు అరెస్టు వారెంట్‌తో వెళ్లగా, వారిని అధ్యక్షుడి భద్రతా బలగాలు అడ్డుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. 
 
దర్యాప్తు అధికారులకు మద్దతుగా 2,700 మంది పోలీసులు అధ్యక్షుడి నివాసానికి చేరుకున్నట్లు తెలిసింది. అరెస్టును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అధ్యక్షుడి భద్రతా బలగాలను సీఐవో అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. న్యాయం జరగకుండా అడ్డుపడితే నేరం కింద పరిగణిస్తామని స్పష్టంచేశారు.
 
అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టుకు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావడంతో అరెస్టును వాయిదా వేస్తున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. సుమారు ఆరు గంట‌ల పాటు.. అధ్య‌క్షుడి భ‌ద్ర‌తా సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. చివ‌ర‌కు పోలీసులు వెన‌క్కి వెళ్లిపోయారు. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో యూన్‌పై నిఘా సంస్థ‌లు ద‌ర్యాప్తు చేప‌డుతున్నాయి.
 
దేశంలో మార్షియ‌ల్ లాను అమలు చేయాల‌ని గ‌త డిసెంబ‌ర్‌లో యూన్ ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో అధ్య‌క్షుడు యూన్‌పై విప‌క్షాలు అభిశంస‌న ప్ర‌క‌టించాయి. దీంతో ద‌క్షిణ‌కొరియాలో తీవ్ర రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. ప‌లు కేసుల్లో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సియోల్ కోర్టు ఇటీవ‌ల ఇచ్చిన స‌మ‌న్ల‌ను యూన్ బేఖాత‌రు చేశారు. 
 
మూడు సార్లు ఆయ‌న స‌మ‌న్ల‌ను విస్మ‌రించారు. దీంతో ఇటీవ‌ల సియోల్ కోర్టు యూన్ అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. ఈ నెల 6లోపు అధ్యక్షుడిని అరెస్టు చేస్తామని సీఐవో ప్రకటించింది. అయితే అధ్యక్షుడు మాత్రం అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.