గత ప్రభుత్వాలు గ్రామాభివృద్ధిని విస్మరించాయి

గత ప్రభుత్వాలు గ్రామాభివృద్ధిని విస్మరించాయి

దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని చెబుతూ అటువంటి గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. డిల్లీలో నిర్వహించిన ‘గ్రామీణ భారత మహోత్సవం 2025’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వెనకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్టీ, ఎస్సీలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అందుకే గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువయ్యాయని తెలిపారు.

దీనితో సహజంగానే పట్టణాల్లోనూ పేదరికం పెరిగిపోయిందని వాపోయారు. సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా గ్రామాలకు, పట్టణాలకు మధ్య ఉన్న అంతరం పెరుగుతూనే ఉందని ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు ప్రస్తుతం తమ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. 

సమాజ సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాటిస్తున్న విధానాలు గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయని ప్రధాని చెప్పారు. మారుమూల గ్రామాల ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి సమ్మిళిత ఆర్థిక విధానాలు అవసరమని ప్రధాని పేర్కొన్నారు.

కరోనా సమయంలో భారత్‌లోని మారుమూల ప్రాంతాల ప్రజలు ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటారని ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేసినట్లు మోదీ పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుందని మోదీ చెప్పారు. 

డిజిటల్ టెక్నాలజీ సహాయంతో దేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఆసుపత్రులను గ్రామాలకు అనుసంధానించామని వెల్లడించారు. గ్రామాలలోని ప్రజలు ప్రస్తుతం టెలీమెడిసిన్ సౌకర్యాలను సైతం పొందుతున్నారని వివరించారు.  పల్లెల్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు, మౌలిక వసతులు అందిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

పీఎం-కిసాన్ పథకం కింద కేంద్రం రైతులకు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల మూలంగా గ్రామీణ భారతంలో పేదరికం దాదాపు 26 శాతం నుంచి 5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. 2025 ప్రారంభంలో గ్రామీణ భారత మహోత్సవ్‌లోని ఈ మహత్తర కార్యక్రమం భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని పరిచయం చేస్తోందని, ఒక గుర్తింపును సృష్టిస్తోందని ఆయన చెప్పారు. 

ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాబార్డ్, ఇతర భాగస్వాములను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లక్షలాది గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు చేరుతోందని పేర్కొంటూ నేడు ప్రజలు 1.5 లక్షల కంటే ఎక్కువ ఆయుష్మాన్ ఆరోగ్య సేవల కోసం మెరుగైన ఎంపికలను పొందుతున్నట్లు చెప్పారు.

ఆరు రోజులపాటు జరిగే ఈ పండుగ సందర్భంగా గ్రామీణ భారతదేశం వ్యవస్థాపక స్ఫూర్తి, సాంస్కృతిక వారసత్వం జరుపుకుంటారు. గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, స్వావలంబన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం, గ్రామీణ సమాజంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో మహోత్సవ్ వివిధ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. 

గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి సాంకేతికత, వినూత్న పద్ధతులను ఉపయోగించుకోవడం గురించి చర్చలను ప్రోత్సహించడం. వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ఆలోచనాపరులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, కళాకారులు, వాటాదారులను కలిసి సహకార, సామూహిక గ్రామీణ పరివర్తన కోసం ప్రణాళిక రూపొందించడం. దీంతోపాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడంతో పాటు వ్యవస్థాపకత ద్వారా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.