మణిపుర్‌లో ఎస్పీ కార్యాలయంపై దాడి

మణిపుర్‌లో ఎస్పీ కార్యాలయంపై దాడి

మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్‌పోక్‌పీలో ఎస్పీ కార్యాలయంపై కుకీ ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్పీ సహా పలువురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్టు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.vదుండగులు రాళ్లు, ఇతర వస్తువులను కార్యాలయంపైకి విసిరారు. కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు.

తూర్పు ఇంఫాల్‌ జిల్లా సరిహద్దుల్లోని సైబోల్‌ గ్రామం నుంచి కేంద్ర భద్రతా దళాలను ఉపసంహరింపజేయడంలో ఎస్పీ విఫలమయ్యారని ఈ దాడికి పాల్పడినవారు ఆరోపించారు.  ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా దళాలు ఇటీవల భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. వీటిని వ్యతిరేకిస్తూ స్థానికంగా పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో కొందరు మహిళలపై భద్రతా దళాలు లాఠీఛార్జీ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. 

కేంద్ర బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే వారిని వెనక్కి పంపించాలనే డిమాండ్‌ మొదలైంది. ఇందులో పోలీసు ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు.

భద్రతా దళాలు వారిని అడ్డుకోవడంతో కాంగ్‌పోక్‌పీ జిల్లా ఎస్పీ కార్యాలయం వైపు దూసుకెళ్తూ రాళ్లు, ఇతర ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎస్పీ ప్రభాకర్‌ సహా అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అటు పలువురు నిరసనకారులకు కూడా గాయాలైనట్లు సమాచారం.