 
                ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ముగిశాయి. అన్ని దేశాల ప్రజలు 2024కు గుడ్‌బై చెప్పి 2025లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వాతావరణ కేంద్రం 2024 సంవత్సరానికి సంబంధించి ఓ కీలక విషయం చెప్పింది. 1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వెల్లడించింది. 
2024లో నేలపై కనిష్ఠ ఉష్ణోగ్రతల సగటు సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉందని పేర్కొంది.  1901 నుంచి 2020 వరకు నమోదైన దీర్ఘకాలిక సగటు కంటే ఇది చాలా ఎక్కువని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. అందుకే 2024 ఏడాది గత 124 ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
దాంతో ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నమోదై ఉన్న 2016 రెండో స్థానానికి వెళ్లిపోయిందని చెప్పారు. 2016లో నేలపై సాధారణ కనిష్ఠ సగటు ఉష్ణోగ్రత కంటే 0.54 సెల్సియస్ ఎక్కువగా నమోదైందని తెలిపారు. వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్, క్లైమేట్ సెంట్రల్ అనే రెండు వాతావరణ శాస్త్రవేత్తల బృందాలు ప్రతి ఏడాది ఉష్ణోగ్రత రిపోర్టులు అందిస్తాయి. 2024లో మొత్తం 41 కి పైగా రోజులు ప్రమాదకరమైన వేడి కలిగిన రోజులుగా రికార్డయ్యాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
                            
                        
	                    




More Stories
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు