మావోయిస్టు అగ్రనేత మల్లోజుల సతీమణి తారక్క లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల సతీమణి తారక్క లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సతీమణి తారక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. తారక్క అలియాస్ విమల సీదం ప్రస్తుతం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల కోటేశ్వర్‌ రావు, మల్లోజుల వేణుగోపాల్‌ అన్నదమ్ములు కాగా.. కోటేశ్వర్‌ రావు అలియాస్‌ కిషన్‌ జీ మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పని చేశారు. ఆయన పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వేణుగోపాల్‌ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

1983లో మావోయిస్టు దళంలో చేరిన తారక్కపై నాలుగు రాష్ట్రాల్లో 170కి పైగా కేసులున్నాయి. ఆమెపై కోటికి పైగా రివార్డు ఉంది. బుధవారం గడ్చిరోలి జిల్లాలో సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షంలో తారక్క సహా మొత్తం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

ఈ సందర్భంగా రూ.1.03కోట్ల రివార్డును సీఎం అందజేశారు. ఈ సందర్భంగా నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సీ-60 కమాండోలు, అధికారులను సైతం సత్కరించారు.

గడ్చిరోలిలో గతంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, అలాంటి ప్రాంతంలో పోలీసులు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గడ్చిరోలి ప్రాంతాన్ని చత్తీస్‌గఢ్‌‌తో అనుసంధానం చేస్తూ రహదారిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 

అలాగే మొబైల్ టవర్లు సైతం నిర్మిస్తున్నారని గుర్తు చేశారు.ఇటీవల నాగపూర్ లో ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ గత ఏడాది 33 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారని చెప్పారు. 

ఇక గడ్చిరోలి జిల్లా ఉత్తర భాగం పూర్తిగా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని, అలాగే 55 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా, 33 మంది లొంగిపోయారని తెలిపారు. మరోవైపు గడ్చిరోలి ప్రాంతానికి చెందిన వందలాది యువత పోలీస్ శాఖలో చేరారని, వారిలో 33 మంది యువకులు మావోయిస్టులు బాధితులు ఉన్నారని వివరించారు. 

మావోయిస్టులపై తమ ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు మూడేళ్ల కాలపరిమి విధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరోవంక, ఛత్తీస్‌గఢ్‌లో భద్రత బలగాలకు తృటిలో ప్రమాదం తప్పింది. భద్రత బలగాలే లక్ష్యంగా ఐ.ఈ.డీ బాంబులను మావోయిస్టులు అమర్చారు. రహదారిపై తనిఖీల్లో భాగంగా వాటిని భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ వెంటనే భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. ఆయా బాంబులను నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఐ.ఈ.డీ బాంబులు మూడు కేజీలు బరువు ఉన్నాయని పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.

ఈ ఒక్క ఏడాది 2024లో బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య 121 ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. వాటిలో 217 మంది తీవ్రవాదులు మరణించారు. ఇక గత ఐదు సంవత్సరాల్లో హతమైన మావోయిస్టుల్లో 57 మంది అగ్రనేతలు ఉన్నారని పోలీస్ అధికారులు తెలిపారు. ఇక మరణించిన మావోయిస్టు అగ్రనేతల్లో.. ఆరుగురు ప్రత్యేక జోనల్ కమిటీ (ఎస్‌జెడ్‌సి) సభ్యులు, నక్సల్స్‌కు సంబంధించిన వివిధ రాష్ట్ర కమిటీల సభ్యులు, 16 మంది డివిజనల్ కమిటీ (డివిసి) సభ్యులు, 32 మంది ఏరియా కమిటీ సభ్యులు, ఒక కంపెనీ డిప్యూటీ కమాండర్, ఇద్దరు ప్లాటూన్ కమాండర్లు ఉన్నారు.

ఈ ఏడాది 925 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, ఒక్క బస్తర్‌లోనే 792 మంది తీవ్రవాదులు లొంగిపోయారు. అలాగే ఈ ప్రాంతంలో 284 ఆయుధాలతోపాటు 311 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.