చిన్మోయ్ కృష్ణ దాస్ కు బెయిల్ నిరాకరణ

చిన్మోయ్ కృష్ణ దాస్ కు బెయిల్ నిరాకరణ
బంగ్లాదేశ్ ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బెయిల్ నిరాక‌రించారు. చిట్ట‌గ్రామ్ మెట్రోపాలిటిన్ సెష‌న్స్ జ‌డ్జి మ‌హ‌మ్మ‌ద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్‌ను తిర‌స్క‌రిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇరు ప‌క్షాల నుంచి సుమారు 30 నిమిషాల పాటు వాద‌న‌లు విన్న త‌ర్వాత ఆయ‌న తీర్పు వెలువరిస్తూ  ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి దాస్‌కు బెయిల్‌ ఇవ్వలేమని తేల్చిచెప్పారు.
 
బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకోనున్న‌ట్లు చిన్మ‌య్ త‌ర‌పు న్యాయ‌వాది అపూర్వ కుమార్ భ‌ట్టాచార్జీ తెలిపారు.  అపూర్వ నేతృత్వంలోని సుమారు 11 మంది సుప్రీంకోర్టు లాయ‌ర్లు గురువారం మెట్రోపాలిట‌న్ కోర్టుకు వెళ్లారు. న్యాయ బృందం త‌మ వాద‌న‌ల‌ను బ‌లంగానే వినిపించినా,కోర్టు మాత్రం చిన్మ‌య్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది.

హిందూ సాధువు, బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జోతే అధికారి ప్రతినిధి అయిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసులు 2024 నవంబరు 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 
 
ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా గతంలో కోర్టు వద్ద జరిగిన ఘర్షణలో ఓ లాయర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.  ఈ కేసులో చిన్మయ్ తరఫున వాదించడానికి ముందుకొచ్చిన లాయర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఎవరూ ముందుకురాకపోవడంతో సమ్మిళిత సనాతన జాగరణ్‌ జోతే 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. 
 
విచారణ సమయంలో ఆయన తరఫున లాయర్లు చిన్మయ్ దాస్ డయాబెటిస్, శ్వాసకోశ ఇబ్బంది సహా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని వాదించారు. అంతేకాదు, ఆయనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారని పేర్కొన్నారు. అయితే, వీటిని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. విచారణ సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంపై ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధా రామన్ దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందూ సన్యాసికి న్యాయం జరిగేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.