
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెరీర్లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో అత్యుత్తమ రేటింగ్స్ సాధించిన భారత బౌలర్గా రికార్డ్ సృష్టించాడు. తాజా ర్యాంకింగ్స్లో బుమ్రా 907 రేటింగ్స్తో అగ్ర స్థానంలో ఉన్నాడు. టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా బౌలర్ సాధించిన అత్యధిక రేటింగ్స్ ఇవే.
ఈ క్రమంలో మాజీ స్పిన్నర్ అశ్విన్ను వెనక్కినెట్టేశాడు. గతంలో అశ్విన్ 904 రేటింగ్స్ సాధించాడు. 2016లో అశ్విన్ తన బెస్ట్‌ను నమోదు చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా తర్వాత, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (843 రేటింగ్స్) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాట్ కమిన్స్ (837 రేటింగ్స్), కగిసో రబాడ (832 రేటింగ్స్), మార్కో యాన్సెన్ (803 రేటింగ్స్) టాప్ – 5లో ఉన్నారు. సౌతాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.
మెల్‌బోర్న్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో రాణించిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం జైస్వాల్ (854 రేటింగ్స్) నాలుగో ప్లేస్లో కొనసాగుతున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో తొలి సెంచరీ నమోదు చేసిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (528 రేటింగ్స్) ఏకంగా 20 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం నితీశ్ 53వ స్థానంలో ఉన్నాడు.
టీ20 ర్యాంకులలో బ్యాటర్ల జాబితాలో టీమ్ఇండియా నుంచి తిలక్ వర్మ (806), సూర్యకుమార్ యాదవ్ (788) టాప్ 5లో ఉన్నారు. ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (855) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి రవి బిష్ణోయ్ (666), అర్ష్‌దీప్ సింగ్ (656) మాత్రమే టాప్ -10లో ఉన్నారు. బిష్ణోయ్ 6వ స్థానం, అర్ష్‌దీప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.
బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా తొమ్మిది వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో బుమ్రా 30 వికెట్లు పడగొట్టాడు. దాంతో బుమ్రా రేటింగ్ పాయింట్లు 907కి పెరిగాయి. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో బుమ్రా 200 టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరాడు.
మ్యాచుల విషయానికి వస్తే టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బుమ్రా రెండోస్థానంలో ఉండగా, ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్ బుమ్రా. కేవలం 44 టెస్టుల్లో ఈ ఘనత అందుకోగా, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 37 టెస్టుల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరి మొదటి స్థానంలో ఉన్నాడు.
బంతులపరంగా టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. 8484 బంతులు వేసి 200 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ అగ్రస్థానంలో ఉన్నాడు.
More Stories
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్