గాజాలో ఆస్పత్రులపై దాడులకు ఆపండి

గాజాలో ఆస్పత్రులపై దాడులకు ఆపండి

గాజాలో ఆస్పత్రులపై దాడులకు ఇజ్రాయిల్‌ ముగింపు పలకాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) సోమవారం పిలుపునిచ్చింది. గాజాలోని ఆస్పత్రులు మరోసారి యుద్ధభూములుగా మారాయని, ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ముప్పు ఎదుర్కొంటుందని డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథ్నామ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

”మరోసారి హెచ్చరిస్తున్నాం : ఆస్పత్రులపై దాడులు ఆపండి. గాజా ప్రజలకు ఆరోగ్య భద్రత అత్యవసరం. మానవతావాదులు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సి వుంది. కాల్పులను విరమించండి” అని టెడ్రోస్‌ పేర్కొన్నారు.  గత వారం ఇజ్రాయిల్‌ దాడి నుండి టెడ్రోస్‌ తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడిలో యుఎన్‌ సిబ్బంది ఒకరు గాయపడ్డారు.

గత కొన్ని రోజులుగా గాజా  ఆస్పత్రులే లక్ష్యంగా ఇజ్రాయిల్  దాడులు జరుపుతున్నది.   ఆస్పత్రుల్లో హమాస్ కార్యకలాపాలను సాగిస్తోందంటూ  ఇజ్రాయిల్  తన దాడులను సమర్థించుకుంటోంది.  గాజాలోని ఆల్‌ వఫా ఆస్పత్రిపై ఆదివారం ఇజ్రాయిల్ జరిపిన దాడిలో  ఏడుగురు పౌరులు మరణించినట్లు పాలస్తీనియన్‌ పౌర రక్షణ సంస్థ తెలిపింది. 

గత శుక్రవారం కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రిపై జరిపిన దాడిలో ఆస్పత్రి సిబ్బంది సహా 240 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిలో ఆస్పత్రి డైరెక్టర్‌ హుస్సామ్‌ అబు సఫియా కూడా ఉన్నారు.

తాజాగా శీతాకాలంలో చలి తీవ్రతకు గడ్డకట్టి చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. చలి తీవ్రత తట్టుకోలేక చనిపోయిన పాలస్తీనా చిన్నారుల సంఖ్య ఏడుకి పెరిగినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల పాలస్తీనియన్లు శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవాలన్నా ఆ టెంట్లను గట్టిగా కట్టే నైలాన్‌ తాడుల ఖరీదు కూడా ఎక్కువే. 

చలిని తట్టుకునేందుకు కప్పుకునే దుప్పట్లు కానీ, కట్టుకునే బట్టలు కానీ వారు కొనుగోలు చేయడం కూడా కష్టంగానే వుంది. సముద్ర తీరప్రాంతానికి సమీపంగా ఉన్న శిబిరాల్లో చలి తీవ్రత వల్ల చిన్నారులు బలి అవుతున్నారు.