అమెరికా వాసులకు అణు యుద్ధ భయం.. బంకర్లకు గిరాకీ

అమెరికా వాసులకు అణు యుద్ధ భయం.. బంకర్లకు గిరాకీ
అమెరికా ప్రజలను మూడో ప్రపంచ యుద్ధం భయపెడుతున్నది. దీంతో అణు యుద్ధం వచ్చినా సురక్షితంగా ప్రాణాలను రక్షించే బంకర్లకు డిమాండ్‌ పెరిగిపోతున్నది. ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని రష్యా చేస్తున్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
 
మరో వైపు ఉత్తర కొరియా, చైనా దేశాలు అణ్వాయుధ సంపత్తిని పెంచుకుపోవడం, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. ఈ అన్ని కారణాలూ అమెరికా వాసులను బంకర్ల కొనుగోలుకు ప్రేరేపిస్తున్నాయి. దీంతో చాలా అమెరికా కుటుంబాలు అణు బంకర్లను కొనుగోలు చేస్తున్నాయి. వీటిని సుమారు 50,000 డాలర్ల వరకు పెట్టి కొంటున్నారని వాటిని తయారు చేసే సంస్థ డెయిలీ మెయిల్‌కు వెల్లడించింది. 
 
మునుపెన్నడూ లేనివిధంగా గత ఏడాది వీటి అమ్మకాలు తారస్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. అమెరికాలోని ఓహియో కేంద్రంగా ఉన్న ఒక బంకర్‌ యజమాని టాడ్‌ స్టంప్‌ మాట్లాడుతూ తూర్పు ప్రాంతంలోని పెన్సిల్వేనియా, పశ్చిమ ప్రాంతంలోని కాలిఫోర్నియాలో వందలాది బంకర్‌లను అమ్మినట్టు చెప్పారు.
 
బంకర్లంటే ఏదో చీకటిగా ఉండే ప్రదేశాలని భావించనక్కర్లేదు. సాధారణ గృహాల్లో ఉండే సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. ఇక లగ్జరీ బంకర్లలో అయితే వంటగదులు, బెడ్‌రూమ్‌లతో పాటు కృత్రిమ కిటికీలు కూడా ఉండి మనం భూమి ఉపరితలంపైనే ఉన్న భావన కలిగిస్తాయి. ముందుగా నిర్మించి ఉన్న బంకర్లయితే పావు అంగుళం స్టీల్‌ ప్లేట్లతో తయారు చేస్తారు. 
 

అలా కాకుండా కావాల్సిన సైజులో షెల్టర్లు కావాల్సి వస్తే భారీ ఆర్‌సీపీ గోడలతో 8 నుంచి 20 అడుగుల పాటు వెయ్యి చదరపు అడుగులు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తారు. కొందరైతే కొన్ని నెలల పాటు నివసించగలిగేలా బంకర్లలో సౌకర్యాలు కోరుతున్నారు.కొంతమంది ప్రజలు నిత్యం ప్రపంచంలో జరిగే పరిణామాల పట్ల ఆందోళన చెందుతుంటారని, నిజంగా అది తమకే జరిగితే ఎలా అని భయపడుతుంటారని, అలాంటి వారే తమకు కస్టమర్లుగా మారుతారని బంకర్‌ యజమాని టాడ్‌ స్టంప్‌ తెలిపారు. ఒకవేళ అణుయుద్ధమే సంభవిస్తే ప్రాణాలతో బయటపడటానికి మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో బంకర్లను నిర్మించినట్టు తెలిపాడు.