ఫీజ్ బకాయిలపై సంక్రాంతి తర్వాత మహోద్యమమే

ఫీజ్ బకాయిలపై సంక్రాంతి తర్వాత మహోద్యమమే

సంక్రాంతి లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు మొత్తం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కిషన్‌ రెడ్డి అధ్యక్షతన మహోద్యమం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడిపోతున్నారని బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు ముసుకునే దుస్థితి వచ్చిందని, దీంతో ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. 

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని చెప్పారు. సంక్రాంతిలోపు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు.

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బండి సంజయ్‌ మండిపడ్డారు. ఇప్పటివరకు 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి, 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గప్పాలు కొడుతోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమని పేర్కొన్నారు.

యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఇచ్చిన హమీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని కేంద్ర మంత్రి మండిపడ్డారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని మాట తప్పిందని ధ్వజమెత్తారు. ఒక్కో నిరుద్యోగికి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.48 వేలు బకాయి పడిందని చెబుతూ  బకాయి పడ్డ ఆ డబ్బును వెంటనే నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని సంజయ్ సూచించారు. అలాగే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.