పక్షి ఢీ కొనడంతోనే దక్షిణ కొరియా విమాన ప్రమాదం

పక్షి ఢీ కొనడంతోనే దక్షిణ కొరియా విమాన ప్రమాదం

విమాన ప్రమాద ఘటనకు దారి తీసిన పరిస్థితులపై అమెరికా బృందం, స్థానిక అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు దక్షిణ కొరియా అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది.   పక్షి ఢీ కొన్న వెంటనే కంట్రోల్‌ టవర్‌ హెచ్చరికలను పంపిందని, దీంతో  పైలెట్‌ అత్యవసర ల్యాండింగ్‌ కోసం ‘మేడే’ సిగల్‌ జారీ చేసినట్లు దర్యాప్తు   అధికారులు సోమవారం  తెలిపారు.   

‘మేడే ‘ (ఓడలు, విమానాలు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఉపయోగించే అంతర్జాతీయ రేడియో డిస్ట్రెస్‌ సిగల్‌) జారీ చేసిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలిందని వెల్లడించారు. వెంటనే విమానాశ్రయ అధికారులు రన్‌వే 19పై ల్యాండింగ్‌ చేసేందుకు అనుమతించారు. 2,800 మీటర్ల పొడవైన రన్‌వేపై విమానం 1,200 మీటర్ల వద్ద రన్‌వేను తాకింది. ల్యాండిగ్‌ గేర్‌ పనిచేయకపోవడంతో విమానం గోడను ఢీ కొట్టిందని , దీంతో మంటలు చెలరేగాయిని వివరించారు.

రన్‌వే పొడవు కారణంగా ప్రమాదం జరిగిందన్న వాదనలను అధికారులు తోసిపుచ్చారు.  బోయింగ్‌, ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ (ఎఫ్‌ఎఎ) సహా నిపుణుల బృందం దక్షిణ కొరియాలోని అధికారులతో కలిసి విచారణ చేస్తోందని యుఎన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (ఎన్‌టిఎస్‌బి) వెల్లడించింది. బ్లాక్‌ బాక్స్‌లు, కాక్‌ పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

ప్రమాదం నుండి బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విమాన సిబ్బందిలో ఒకరు కోలుకున్నారని, వైద్యులతో మాట్లాడినట్లు దక్షిణ కొరియా అధికారికి వార్తా సంస్థ తెలిపింది. అయితే అతనికి పలు ఫ్రాక్చర్లు అయ్యాయని పేర్కొంది. అతనితో పాటు మరో మహిళ (25) తలకు గాయమైందని, చికిత్స కొనసాగుతోందని తెలిపింది.

ఆదివారం ఉదయం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు 290 కి.మీ దూరంలోని మువాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతూ అదుపుతప్పడంతో గోడను ఢకొీని మంటల్లో చిక్కుకున్న ప్రమాదంలో 179 మంది మరణించిన సంగతి తెలిసిందే.