
తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి సోమవారం ప్రారంభం కానున్నాయి. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులర్పించడం కోసం రేపు ప్రత్యేకంగా సమావేశమవుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రభుత్వ అధికారులతో సమన్యయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులకు సభాపతి ప్రసాద్ కుమార్ సూచించారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు శనివారం లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు.
శాసనసభ నాలుగో విడతలో రెండో సమావేశంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని కోరారు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని 16 నియమం కింద గల రెండో నిబంధన అధికారాల మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ సోమవారం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలను పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంతాపదినాల్లోనే శాసనసభ సమావేశం పెట్టి శ్రద్ధాంజలి ఘటించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది . శాసనసభ శీతాకాల సమావేశాలు ఇదే నెలలో 9 నుంచి 21వ తేదీ వరకు జరిగాయి.
శాసనసభ ప్రత్యేక సమావేశం దృష్ట్యా ఈ నెల 30న జరగాల్సిన మంత్రిమండలి సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గతంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నా సంతాప దినాలు ఉండటం వల్ల దానిని నిర్వహించరాదని నిర్ణయించుకుంది. జనవరి మొదటి వారంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాల ద్వారా తెలిసింది.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు