రేపు పీఎస్‌ఎల్‌వీ సీ 60 రాకెట్‌ ప్రయోగం

రేపు పీఎస్‌ఎల్‌వీ సీ 60 రాకెట్‌ ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  మరో ప్రయోగానికి సిద్ధమయ్యింది. సోమవారం ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ 60 రాకెట్‌కు మరికొద్ది గంటల్లో కౌంట్‌డౌన్‌ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సూళ్లురుపేట షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు రాకెట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ రాకెట్‌ ప్రయోగానికి ఈరోజు రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్‌  ప్రారంభానికి ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ రాత్రి బెంగళూరు నుంచి షార్‌కు చేరుకోనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం కాగా పీఎస్‌ఎల్‌వీ కోర్‌ అలోన్‌ దశతో చేసే 18వ ప్రయోగమిది. రేపు నింగికేగనున్న పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ 320 టన్నుల బరువు, 44.5 మీటర్ల ఎత్తు ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

స్ట్రాపాన్‌ బూస్టర్లను ఉపయోగించకపోవడంతో ఈ రాకెట్‌ బరువు 229 టన్నులుగా ఉంటుందని వివరించారు. రాకెట్‌లో రెండో దశకు ద్రవ ఇంధనం, మూడో దశకు ఘన ఇంధనం, నాలుగో దశకు ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నట్లు వివరించారు. ఇస్రో రూపొందించిన స్పాడెక్స్‌ అనే జంట ఉపగ్రహాలు ఈ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, వీటిని ఛేజర్, టార్గెట్ అనే పేర్లను నామకరణం చేశామన్నారు. ఈ ఉపగ్రహాలు స్పేస్‌ డాకింగ్, ఫార్మేషన్‌ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం వంటి సేవలకు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.