పాకిస్థాన్‌ స్థావరాలే లక్ష్యంగా తాలిబన్ల ప్రతీకార దాడి

పాకిస్థాన్‌ స్థావరాలే లక్ష్యంగా తాలిబన్ల ప్రతీకార దాడి

పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీనిలో భాగంగా పాక్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపింది. ఈ విషయాన్ని స్వయంగా అఫ్గాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.  “పాకిస్థాన్‌పై అఫ్గాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. ఆ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం” అని రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయాతుల్లా క్వార్జామి – ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. 

కానీ పాక్‌పై ఈ దాడులు ఎలా చేశారు? ఈ దాడిలో ఎంత మంది మరణించారనే అంశాలను ఆయన ప్రస్తావించలేదు. అయితే తాలిబన్లకు మద్దతిస్తున్న ఓ మీడియా సంస్థ మాత్రం, ఈ దాడుల్లో 19 మంది పాకిస్థాన్‌ సైనికులు మరణించారని తన కథనంలో పేర్కొంది. తాలిబన్ల దాడులపై ఇప్పటి వరకు పాక్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా అఫ్గాన్‌ను తాలిబన్‌లు ఆక్రమించుకున్న తర్వాత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది. 

ఈ ఆరోపణలను తాలిబన్‌ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో అఫ్గాన్‌పై దాడులు చేసిన పాక్‌, ఇటీవల మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది.  ఈ దాడుల్లో ఇప్పటి వరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. 

ఈ దాడులపై పాక్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తమ దేశంపై దాడులకు పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిన అఫ్గానిస్థాన్‌ తాజాగా దాడులకు దిగింది. మరోవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో అఫ్గానిస్థాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది. అయితే తాము సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామన్న అభియోగాలను అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. తమ గడ్డపై నుంచి ఎవరినీ మరో దేశంపై దాడులకు దిగనివ్వబోమని ఆఫ్గాన్ చెబుతోంది.