జర్మనీ పార్లమెంట్ రద్దు.. ఫిబ్రవరి 23న ఎన్నికలు

జర్మనీ పార్లమెంట్ రద్దు.. ఫిబ్రవరి 23న ఎన్నికలు

జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ -వాల్టర్‌ స్టెయిన్‌మీర్‌ శుక్రవారం పార్లమెంటును రద్దు చేశారు. ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ డిసెంబర్‌ 16న విశ్వాసపరీక్షలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంటును రద్దు చేసి, ఫిబ్రవరి 23న ఎన్నికలకు పిలుపునిచ్చారు. “కష్ట సమయాల్లో” స్థిరత్వాన్ని కొనసాగించడానికి దేశానికి “చర్యలు తీసుకోగల ప్రభుత్వం”, “పార్లమెంటులో నమ్మకమైన మెజారిటీలు” అవసరమని స్టెయిన్‌మీర్ తెలిపారు.

బిలియనీర్ ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “విదేశీ ప్రభావం” గురించి హెచ్చరిస్తూ, ఎన్నికల ప్రచారాన్ని న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధ్యక్షుడు పిలుపునిచ్చారు. వాస్తవానికి అనుకున్న సమయం కన్నా ఏడు నెలల ముందుగా అంటే ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాన పార్టీల నేతలు అంగీకరించాయి.

నవంబర్‌ 6న మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో ఓలాఫ్‌ విశ్వాసపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.  మొత్తం 733 మంది సభ్యులు ఉన్న దిగువ సభలో ఓలాఫ్‌కు అనుకూలంగా కేవలం 207 మంది మాత్రమే ఓటు వేశారు. వ్యతిరేకంగా 394 మంది ఓటు వేశారు. మరో 116 మంది గైర్హాజరయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధానంతర రాజ్యాంగం బండెస్టాగ్‌ (జర్మనీ పార్లమెంట్‌)ను రద్దు చేయడానికి అనుమతించదు. 

పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలను నిర్వహించాలా వద్దా అనేది అధ్యక్షులు స్టెయిన్‌మీర్‌పై ఉంది. విశ్వాస పరీక్ష జరిగిన 21 రోజుల్లోగా నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంది. దీంతో నేడు పార్లమెంటును రద్దు చేసినట్లు స్టెయిన్‌ మీర్‌ ప్రకటించారు. పార్లమెంట్‌ను రద్దు చేసిన తర్వాత 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి వుంది.