219 శాతం లోటుతో ఆందోళనకరంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి

219 శాతం లోటుతో ఆందోళనకరంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్‌ వెల్లడించిన నివేదిక బడ్జెట్‌ అంచనాలకు విరుద్ధంగా ఆదాయం, వ్యయం కనిపిస్తున్నది. తాజాగా నవంబర్‌ నెలాఖరుకు సంబంధించిన నివేదికలను కాగ్‌ విడుదల చేసింది. ఆదాయం తగ్గిపోవడంతోపాటు వ్యయం భారీ నమోదుకావడం, లోటు కూడా అంచనాలకు మించి నమోదుకావడం వంటివి ఈ నివేదికలో వెల్లడయ్యాయి.
 
ప్రధానంగా బడ్జెట్‌లో ప్రతిపాదించిన దానికన్నా వాస్తవంగా ఎక్కువ లోటు కనిపిస్తుండడం గమనార్హం. ఆదాయ లోటును బడ్జెట్‌లో రూ. 34,000 కోట్ల వరకు ప్రతిపాదించగా, నవంబర్‌ నాటికి ఆ లోటు రూ. 56,804 కోట్లకు నమోదుకావడం విశేషం. అంటే బడ్జెట్‌ అంచనాల కన్నా ఏకంగా 163 శాతం, గతేడాది ఇదే సమయం కన్నా 210 శాతం అధికంగా నమోదైంది.
 
 ద్రవ్య లోటు కూడా బడ్జెట్‌ అరచనాలకుఅప్పుడే దగ్గరగా వచ్చేసింది. బడ్జెట్‌లో రూ. 68,773 కోట్లుగా ప్రతిపాదించగా, నవంబర్‌ నాటికే రూ. 65,000 కోట్లు దాటిపోయియింది. గతేడాది కన్నా ఇది 120 శాతం అధికం కావడం గమనార్హం. కాగ్‌ వెల్లడిరచిన నివేదికలో ఆదాయ వ్యయాలను అధ్యయనం చేస్తే బడ్జెట్‌లో రూ. 2.69 లక్షల కోట్లుగా అరచనా వేయగా, నవంబర్‌ నాటికి  రూ. 1.66 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. 
 
ఇందులో పన్నులు, గ్రాంట్ల ద్వారా వచ్చినది కేవలం రూ. లక్ష కోట్లు మాత్రమే. మిగిలిన రూ. 65,000 కోట్లకు పైగా రుణాల ద్వారా సమీకరించాల్సి వచ్చింది.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. కేంద్రం నుంచి రూ. 30,000 కోట్ల వరకు గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం రూ. 9,700 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. ఇది మొత్తం అంచనాల్లో కేవలం 32 శాతం మాత్రమేనని తేలింది. 
 
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు రూ. 35,000 కోట్లు వస్తాయని అంచనా వేసుకోగా, ఇప్పటివరకు 62 శాతంతో  రూ. 22,000 కోట్ల వరకు వచ్చాయి.
స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 13,500 కోట్లుకుగాను రూ. 5,438 కోట్లు, జిఎస్‌టి ద్వారా రూ. 52,000 కోట్లకుగాను రూ. 32,000 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ. 24,500 కోట్లకుగాను రూ. 11,303 కోట్లు, రాష్ట్ర ఎక్సయిజ్‌ పన్నుల ద్వారా రూ. 25,597 కోట్లకుగాను రూ. 12,154 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఖజానాకు చేరుకున్నాయి.

రుణాల భారం కూడా ఖజానాపై ఎక్కువగానే పడుతోంది. వాస్తవానికి మొత్తం ఆర్థిక సంవత్సరానికి తీసుకోవాలనుకున్న రుణాన్ని కేవలం ఎనిమిది నెలల్లోనే తీసుకోవడం ఆందోళనకరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. బడ్జెట్‌లో రూ. 68,360 కోట్లు రుణంగా సమీకరించుకోవాలని ప్రతిపాదించారు. అయితే ఇప్పటికే రూ. 65,590 కోట్లు తీసుకోవడం గమనార్హం.  ఈ లెక్కన మిగిలిన నాలుగు నెలలకు కేవలం దాదాపు రూ. 3,000 కోట్లే మిగిలినట్టయింది.