
కజకిస్థాన్‌లో ప్రయాణికుల విమానం కూలి 38 మంది చనిపోయిన దుర్ఘటన వెనుక, వేళ్లన్నీ రష్యా వైపే చూపిస్తున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నంలోనే రష్యా గగనతల వ్యవస్థ యాక్టివేట్ అయి విమానాన్ని కూల్చినట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా రష్యా ఈ పని చేసినట్లు భావించడం లేదనీ, అయితే నిజాన్ని అంగీకరించాలని అజర్ బైజాన్ కోరుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు తమపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దని రష్యా స్పష్టంచేసింది.
అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం కూలి 38 మంది మృతి చెందడంపై పలు ఊహాగానాలు జరుగుతున్నాయి. ఓ పక్షి లేదా పక్షుల గుంపును ఢీకొట్టడం వల్ల, విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని రష్యా విమానయాన శాఖ ప్రకటించింది. కానీ విమానంపై కాల్పుల గుర్తులు కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తుంది.
కజకిస్థాన్‌లో విమానం కూలిన ఆక్టావ్ నగర ప్రాంతంలో కొన్ని రోజులుగా రష్యా గగనతల రక్షణ వ్యవస్థ గస్తీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ డ్రోన్లు తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల విమానాన్ని కూడా డ్రోన్‌గా పొరబడి, ఆటోమేటిక్‌గా పాంట్సిర్-ఎస్ అనే స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అయి విమానాన్ని కూల్చినట్లు సాంకేతిక అవగాహన ఉన్న కొన్ని సంస్థలు తెలిపాయి.
ఆ విమానంలో సిగ్నల్ జామింగ్ జరిగినట్లు అంతకుముందు ఫ్లైట్ రాడార్ సంస్థ కూడా ధ్రువీకరించింది. అయితే రష్యా ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని స్పష్టమవుతోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఐతే ఈ దుర్ఘటన జరిగింది తమ వల్లే అని రష్యా అంగీకరించాలని అజర్ బైజాన్ కోరుతోంది.
విమాన ప్రమాద ఘటనపై అజర్‌బైజాన్ చేస్తున్న విచారణ కూడా రష్యన్ గగనతల రక్షణ వ్యవస్థే దుర్ఘటనకు కారణమని ధ్రువీకరించిందని సమాచారం. ఘటనపై స్పందించిన రష్యా, విచారణ పూర్తయ్యే వరకు ఇలాంటి ఊహాగానాలు చేయడం సరికాదని పేర్కొంది. రష్యా వల్లే ప్రమాదం జరిగిందని ఇప్పుడే ధ్రువీకరించలేమనీ, అలాగని ఈ విషయాన్ని కొట్టిపారేయలేమని కూడా కజకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఘటనకు గల కారణాలపై పారదర్శక విచారణకు పూర్తిగా సహకరించాలని కెనడా సహా పలు దేశాలు రష్యాను కోరాయి.
బుధవారం అజర్ బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని చెచెన్యాకు వెళుతున్న విమానం కజకిస్థాన్‌లోని ఆక్టౌ నగరానికి సమీపంలో కూలింది. పొగమంచు కారణంగా అది కజకిస్థాన్‌కు దారి మళ్లిందని, ఈ క్రమంలోనే పక్షుల గుంపును ఢీకొట్టడంతో సాంకేతిక సమస్య తలెత్తి అది కూలిందని తొలుత వార్తలు వచ్చాయి. ఆ ఘటన జరిగిన సమయంలో విమానంలో 67 మంది ఉండగా, 38 మంది చనిపోయారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి