
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మెన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ పిల్లా రమాకుమారి బీజేపీలో చేరారు. రాజమహేంద్రవరంలో జీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి సమక్షంలో వారు బుధవారం పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు, మంత్రి అమిత్షా ఆశీస్సులతో బీజేపీలో చేరుతున్నట్టు వెల్లడించారు.
ఆడారి ఆనంద్ కుమార్ చేరికతో విశాఖ ప్రాంతంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎంపీ పురందేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారని పురందేశ్వరి చెప్పారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమవుతోందని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.
గత కొన్ని నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో వీరు టీడీపీలో గాని లేదా బీజేపీ లో గాని చేరతారని జోరుగా ప్రచారం సాగింది. ఈ పరిణామంలో ఈరోజు రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
గత ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఆనంద్ కుమార్ ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖ డెయిరీలో ఆర్థిక అవకతవకలపై పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. శాసనసభలోనూ చర్చ జరిగింది. ఈ ఫిర్యాదులపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన సభాసంఘం ఇటీవల విశాఖ వెళ్లి డెయిరీ అధికారులతో సమావేశమైంది. ఈ క్రమంలో ఆడారి అప్రమత్తమయ్యారు. వైసీపీలో కొనసాగితే విచారణ ఇంకా లోతుగా జరుగుతుందన్న అంచనాతో కూటమిలోని పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ, జనసేనల్లో చేర్చుకోవడానికి ఆ పార్టీల నాయకత్వాలు సుముఖంగా లేకపోవడంతో బీజేపీ చేరినట్లు తెలుస్తున్నది.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు