నితీష్- నవీన్‌లకు భారతరత్న ఇవ్వాలి

నితీష్- నవీన్‌లకు భారతరత్న ఇవ్వాలి

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు తమ తమ రాష్ట్రాలకు ఎంతో గొప్ప సేవలందించారని ఆయన ప్రశంసించారు. బీహార్‌లో నితీష్ కుమార్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించగా, ఒడిశాలో నవీన్ పట్నాయక్ దీర్ఘకాలిక నాయకత్వం ద్వారా రాష్ట్రం ప్రగతిలో ముందడుగు వేసిందని ఆయన తెలిపారు.

గిరిరాజ్ సింగ్ ప్రకటనలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే ముందు బీహార్ శిథిలావస్థలో ఉన్న రోడ్లు, పాఠశాలలు,  ఇతర మౌలిక సదుపాయాలను ప్రస్తావించారు. ఆయన నాయకత్వంలో ఈ అంశాల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నట్లు వివరించారు. నవీన్ పట్నాయక్ ఎన్నో ఏళ్లుగా ఒడిశాకు సేవలందించారని, ఆయన పరిపాలనలో రాష్ట్రం మౌలికంగా అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఇలాంటి నాయకులు దేశానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చారని, అందువల్ల వారు భారతరత్నకు అర్హులని ఆయన తెలిపారు.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా గిరిరాజ్ సింగ్, నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్‌లో ఎన్‌డిఎ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని విపక్ష కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజలు ఎన్‌డిఏపై మళ్లీ నమ్మకం ఉంచుతారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

జేడీయూ నేతలు రాజీవ్ రంజన్, సంజయ్ ఝా, అలాగే బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నితీష్ కుమార్ నాయకత్వంపై తమ మద్దతును స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, నితీష్ కలిసికట్టుగా బీహార్ ఎన్నికల్లో ఎన్‌డిఏ విజయాన్ని సాకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.