హిమాచల్‌ లో హిమపాతంతో స్థంభించిపోతున్న రవాణా

హిమాచల్‌ లో హిమపాతంతో స్థంభించిపోతున్న రవాణా

ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. 

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలీతోపాటు రాజధాని సిమ్లాలో దట్టంగా మంచు కురుస్తోంది. హిమపాతం భారీగా పడుతుండటంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. 

దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకున్నాయి.  విపరీతమైన మంచు కారణంగా రోహతంగ్‌లోని సొలాంగ్‌ – అటల్‌ టన్నెల్‌ మధ్య సోమవారం రాత్రి దాదాపు వెయ్యికి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. 

దట్టంగా మంచు కురుస్తుండటంతో ముందు వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 700 మందికిపైగా పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీ, రాజధాని సిమ్లా సహా తదితర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. దీంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

తీవ్రమైన మంచు పరిస్థితుల దృష్ట్యా అధికారులు పలు రహదారులను మూసివేశారు. మూడు జాతీయ రహదారులు సహా 174 రోడ్లను మూసివేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. కాగా, ఏటా క్రిస్మస్‌, నూతన సంవత్సరం నేపథ్యంలో డిసెంబర్‌ చివరి వారంలో మనాలీ, సిమ్లాకు పర్యాటకులు పోటెత్తుతుంటారు. 

ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా తరలివస్తుంటారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతుంటారు. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు మనాలీ, సిమ్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.