
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ బాధ్యాతారాహిత్యమే కారణమని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన, తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా సీఎం వ్యాఖ్యలను అల్లు అర్జున్ ఖండించడంతో ఈ వివాదం ఆదివారం ఒక్కసారిగా మళ్లీ రాజుకుంది. ఆ సంఘటనలో తన తప్పేమిలేదని అల్లు అర్జున్ వాదనను ఖండిస్తూ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ఆదివారం సంచలన వీడియో మీడియాకు విడుదల చేశారు.
మరోవైపు కరీంనగర్ పర్యటనకు వెళ్లిన డిజిపి జితేందర్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ, సినిమాలోనే హీరో, వారు బయట మామూలు పౌరులేనన్న విషయం మరిచిపోవద్దని గుర్తు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన దానినే ఖండిస్తారా? అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేయగా, అసలు ఆ సినిమాకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వమే అసలు ముద్దాయని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ భిన్నంగా స్పందించారు.
కాగా తెలుగు సినిమా పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అల్లు అర్జున్ ఉదంతంలో సీఎం వైఖరి తప్పని, ఎంఐఎం నాయకులతో కలిసి టార్గెట్ చేశారని ఆరోపించారు. బండి సంజయ్ ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వానికి, చట్టం ముందు అందరూ సమానమేనని, అసలు తెలుగు సినిమా ఇండ్రస్టీ హైదరాబాద్‌కు వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమని పేర్కొన్నారు.
ఇలా ఉండగా ఆదివారం సాయంత్రం ఉస్మానియా జెఏసీ పేరుతో కొందరు యువకులు జాబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి చేసారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలను పగలగొట్టి ధ్వంసం చేశారు. అనంతరం ఆందోళన చేస్తోన్న ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు పీఎస్‌కు తరలించారు.
మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియూద్దీన్ అధ్వర్యంలో అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడమే కాకుండా అల్లు అర్జున్ వ్యాఖ్యల వెనుక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
ఇంకా ఈ వివాదంపై కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తీవ్రంగా స్పందించి ప్రకటనలు చేయడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకున్నట్టు అయింది. మరోవంక, ఒక ఎసిపి మీడియా సమావేశంలో అల్లు అర్జున్ పై వ్యక్తిగతంగా దూషణలకు దిగారు. దానితో ముఖ్యమంత్రి, పోలీస్ అధికారులు నష్టనివారణ చర్యలకు దిగాల్సి వచ్చింది.
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిజిపి, సిపికి సిఎం ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించమని హెచ్చిరంచారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధంలేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దానితో ఆ ఎసిపిని సస్పెండ్ చేశారు.
ఇలా ఉండగా ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలపై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మరోసారి స్పందించారు. కొందరు తన అభిమానుల పేరిట రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని అలాంటి వారి పట్ల అభిమానులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్టు కూడా అర్జన్ హెచ్చరించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు