
తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్-2047 లక్ష్యమని టీటీడీ ఈవో జె.శ్యామల రావు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా తిరుమల విజన్-2047 కోసం ప్రతిపాదనలు ఆహ్వానించినట్లు తెలిపారు. తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. 2019 తుడా మాస్టర్ ప్లాన్ లో భాగంగా తిరుమల జోనల్ ప్లాన్ ను తయారు చేయడం జరిగిందన్నారు.
అయితే 2017 సంవత్సరం సమాచారం ఆధారంగా చేసిన ప్రతిపాదనలను ఆధునీకరించినట్లు తెలియజేశారు. దేశంలోనే ఇతర ఆలయాలకు ఆదర్శవంతంగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. సుమారు 18 ప్రాజెక్టులకు ప్రణాళికల కోసం చేసేందుకు 9 సంపూర్ణ నివేదికలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తిరుమల విజన్-2047 లక్ష్యాలను వివరించారు.
తిరుమల విజన్-2047 లక్ష్యాలు
- తిరుమల నడక మార్గాల ఆధునీకరణ, బహుళస్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్డుల నిర్మాణం, సబ్ వే ల నిర్మాణం, రామ్ భగీచ, బాలాజీ బస్టాండులను పునర్నిర్మాణం.
- భక్తులకు వసతి కోసం అలిపిరి దగ్గర 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు, ఆధ్యాత్మికత ప్రతిబింభించేలా తిరుమలలో భవనాల రూపకల్పన.
- టీటీడీలో ఉన్న 31 మంది హిందూయేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు పంపడం, లేదా వీఆర్ఎస్ ఇవ్వాలని బోర్డు నిర్ణయం మేరకు చర్యలు.
- తిరుమలలో రోడ్ల ఆక్రమణ చేస్తూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న దుకాణదారులు, హాకర్ లైసెన్సుదారుల, అనధికార తట్టలపై కఠిన చర్యలు.
- తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన పార్కింగ్, మౌలిక సదుపాయాలు, మాడ వీధుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.
- ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు.
- సనాతన హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణలో యువతను భాగస్వామ్యం చేసేందుకు కృషి. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సహకారంతో యువతలో ఆధ్యాత్మికత పెంచేలా చర్యలు.
- ఇప్పటి వరకు చేపట్టిన హెడీపీపీ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించి మరింత మెరుగ్గా కార్యక్రమాలు నిర్వహణ.
- తిరుమలలోని ప్రైవేట్ క్యాంటీన్లలో ధరలు నియంత్రించి, పేరొందిన సంస్థలకు నిర్వహణా బాధ్యతలు అప్పగించి నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు.
- తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు, వర్షపు నీరు, మురుగు నీరు వేరు వేరుగా వెళ్లేలా డ్రెయిన్లు నిర్మాణం.
- సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం, వసతి అందించేలా చర్యలు.
- చాట్ జీపీటీ తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్ బాట్ అభివృద్ధికి ప్రయత్నం.
- గతంలో ఉన్న వ్యవస్థపరమైన లోపాలను అడ్డుపెట్టుకుని భక్తులను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు. ఎప్పటికప్పుడు పోలీసులు, విజిలెన్స్ సహకారంతో దళారుల నియంత్రణ.
- టిటిడి ఆధ్వర్యంలో ఉన్న 61 ఆలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు
More Stories
వైసీపీ అవినీతి పాలనకు బాబు, మోదీ చరమగీతం
2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం
విశాఖ ఉక్కుపై వామపక్ష పార్టీల దుష్ప్రచారం నమ్మవద్దు