సంతానోత్పత్తి సామర్థ్యం లేని పురుషులకు ఏఐ టూల్‌

సంతానోత్పత్తి సామర్థ్యం లేని పురుషులకు ఏఐ టూల్‌
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం లేకపోవడానికి దారి తీసే జన్యుపరమైన కారణాన్ని, ఐవీఎఫ్‌ ఫలితాలను ముందుగానే తెలుసుకునేందుకు ఓ టూల్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అభివృద్ధి చేసింది. ఇది కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్‌. ఈ ఏఐ బేస్డ్‌ టూల్‌ను ‘ఫెర్టిలిటీ ప్రిడిక్టర్‌’ అని పిలుస్తున్నారు. 
 
జన్యు సమస్యలతో బాధపడుతున్న పురుషుల్లో అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ (ఏఆర్‌టీ) సక్సెస్‌ రేట్‌, స్పెర్మ్‌ రిట్రీవల్‌ రేట్లను ఈ టూల్‌ ముందుగా అంచనా వేసి చెప్తుంది. దీనిని అభివృద్ధిపరచడంలో అమిటీ విశ్వవిద్యాలయం సహకరించింది. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం లేకపోవడానికి కారణమయ్యే వై క్రోమోజోమ్‌ మైక్రోడిలీషన్‌ను ఇది గుర్తిస్తుంది.

ఈ ఏఐ టూల్‌కు సంబంధించిన అధ్యయనం గత వారం ‘జర్నల్‌ ఆఫ్‌ అసిస్టెడ్‌ రీప్రొడక్షన్‌ అండ్‌ జెనెటిక్స్‌’లో ప్రచురితమైంది. ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రీప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ సీనియర్‌ సైంటిస్ట్‌ దీపక్‌ మోదీ మాట్లాడుతూ, 50 శాతం మంది దంపతులు సంతానోత్పత్తి సామర్థ్య లేమిని అనుభవిస్తున్నారని చెప్పారు.

వీరిలో వీర్యం ఉత్పత్తి సమస్యలు ఉండి ఉండవచ్చన్నారు. దీనికి ప్రధాన కారణాల్లో వై క్రోమోజోమ్‌ మైక్రోడిలీషన్‌ ఒకటని చెప్పారు. పురుషుల్లో ఈ జన్యు లోపం వల్ల తగినంత వీర్యాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం వృషణాలకు ఉండదని, ఫలితంగా సంతానోత్పత్తి సామర్థ్యం లేమికి దారి తీస్తున్నదని వివరించారు. ఇటువంటి పురుషులు తండ్రిగా మారాలనుకుంటే, ఐవీఎఫ్‌ వంటి అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నిక్స్‌ అవసరమని తెలిపారు.