
మరో రెండు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, కాలుష్య సమస్యను లేవనెత్తడం, అవినీతి ఆరోపణలను ఎత్తి చూపడం ద్వారా బిజెపి అధికార ఆప్ ప్రభుత్వంపై ఎన్నికల సమరంపై సమరసంఘారావం పూరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం ‘ఆరోప్ పాత్ర’ (ఛార్జ్ షీట్)ను బిజెపి విడుదల చేసింది.
బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ బిజెపి అధ్యక్షడు వీరేంద్ర సచ్‌దేవా, ఇతర పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఇటీవల ఓల్డ్ రాజేందర్ నగర్లో వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా ముగ్గురు యుపిఎస్సి అభ్యర్థుల విషాదకరమైన మరణాలు సహా వివిధ పౌర సమస్యలను నిర్వహించడంపై కేజ్రీవాల్ పరిపాలనపై ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు.
ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అసమర్థ ప్రభుత్వమని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం దీనిని సరస్సుల నగరంగా మార్చాలని కోరుకుంటుందని, కానీ వారి నిర్లక్ష్యం కారణంగా యువకులు ప్రాణాలు కోల్పోవడాన్ని మనం చూశామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కలుషితమైన యమునా నదిలో స్నానం చేయాలని పిలుపునిచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
‘కేజ్రీవాల్జీ.. మీరు తరచుగా నంబర్ 1 అని చెబుతుంటారు. మీరు ఎందులో నంబర్ 1..? దేశంలోనే అత్యంత ఖరీదైన నీటిని మీ ప్రభుత్వం అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ నంబర్ 1. దేశంలోనే అత్యంత అవినీతిపరులైన మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు’ అంటూ కేజ్రీవాల్‌పై అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు.
“మనం కేజ్రీవాల్ అవినీతి, కాలుష్యం నుండి ఢిల్లీని రక్షించాలి. 2025 నాటికి యమునా నదిని శుభ్రం చేయకపోతే, మేము అతనిని జవాబుదారీగా ఉంచుతాము కాబట్టి యమునా నదిలో స్నానం చేయాలని నేను కేజ్రీవాల్‌ను విజ్ఞప్తి చేస్తున్నాను” అని బిజెపి ఎంపి సవాల్ చేశారు. పూర్వాంచల్‌కు చెందిన ప్రజలు యమునా నది ఒడ్డున భక్తితో, ఆచారాలతో ఛత్ పూజలు చేసేవారని, కానీ ఇప్పుడు చేయడం లేదని పేర్కొంటూ ఆయన యమునా నదిలోని కాలుష్యాన్ని విమర్శించారు.
“పదేళ్లు గడిచాయి, యమునా నది శుభ్రం చేయబడిందా? ఢిల్లీ ఏక్యూఐ 500 దాటింది. యమునా నది తీవ్రంగా కలుషితమైంది. ధన్యవాదాలు, కేజ్రీవాల్ ప్రభుత్వం. ప్రతిగా, ఢిల్లీ ప్రజలకు కనీస నీటి వసతి కూడా లేకుండా పోయింది” అంటూ విమర్శించారు. “ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ అందరికీ నీటి సరఫరాను నిర్ధారించింది, కానీ కేజ్రీవాల్ ఇక్కడ దానిని అమలు చేయడానికి అనుమతించలేదు,” అని ఆయన ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక అవినీతి చర్యలకు పాల్పడిందని కూడా ఆయన ఆరోపించారు.
“ఢిల్లీ పాఠశాలలను ప్రపంచ స్థాయిగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ 2,00,000 మందికి పైగా విద్యార్థులు ఇప్పటికీ విద్యకు దూరంగా ఉన్నారు. ప్రజలకు 24/7 శుభ్రమైన, ఉచిత నీటిని హామీ ఇచ్చారు. కానీ నేడు, వేలాది కుటుంబాలు డబ్బు ఖర్చు చేసి ట్యాంకర్ల నుండి నీటిని కొనుగోలు చేయవలసి వస్తుంది. ఢిల్లీలో ఉచిత క్లినిక్‌లు, పెద్ద ఆసుపత్రులను వారు హామీ ఇచ్చారు. కానీ నేడు 70 శాతం మంది రోగులు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందవలసి వస్తుంది” అంటూ కేజ్రీవాల్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.
“ఏక్యూఐ స్థాయి ఒకప్పుడు 1200 దాటింది. ఇప్పటికీ 500 కంటే ఎక్కువగా ఉంది. ఢిల్లీని అవినీతి రహితంగా చేస్తామని వారు హామీ ఇచ్చారు. కానీ వారి పార్టీకి చెందిన ఎనిమిది మంది మంత్రులు, ఒక ఎంపీ , 15 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే జైలు పాలయ్యారు,” అని ఆయన గుర్తు చేశారు. అధిక వాయు కాలుష్యం, చెడు మురుగునీటి వ్యవస్థ కారణంగా ఢిల్లీ గ్యాస్ చాంబర్‌గా మారిందని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ఇది మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు కారణమవుతోందని చెప్పారు.
ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వంలో విస్తృతమైన అవినీతి, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆరోపించారు. నగర డ్రైనేజీ వ్యవస్థ పేలవమైన స్థితిని ఎత్తిచూపారు. ప్రజా సంక్షేమం కంటే ఆప్ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం కాలువలను శుభ్రం చేయడంలో విఫలమైందని, దీనివల్ల తీవ్రమైన వరదలు, ప్రాణనష్టం జరిగిందని ఆయన విమర్శించారు.
ఆప్ నేతలు తమ సొంత ప్రయోజనాల గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారని తెలిపారు. ఛార్జ్ షీట్లో బిజెపి నాయకులు కీలకమైన ఆప్ అధికారుల రాజీనామాకు పిలుపునిచ్చారు. ఇటీవలి సంఘటనల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాలని వారు ప్రజలను కోరారు. రాబోయే ఎన్నికల్లో ఆదేశం ఇస్తే గణనీయమైన మార్పులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
కాగా బిజెపి ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీపై బీజేపీకి ఎలాంటి విజన్ లేదని, తనను ఎలా వేధించాలో మాత్రమే తెలుసునని ఎద్దేవా చేశారు. ‘ఈ ఎన్నికల కోసం బీజేపీకి ఎలాంటి అజెండా లేదు. ఇంత వరకూ సీఎం అభ్యర్థి కూడా లేరు. వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు’ అని కేజ్రీవాల్ విమర్శించారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం