ఇకపై టికెట్ల పెంపు.. బెనిఫిట్‌ షోలు బంద్‌

ఇకపై టికెట్ల పెంపు.. బెనిఫిట్‌ షోలు బంద్‌

* ఒక్కరోజు హీరో జైలుకెళ్లొస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం పరామర్శిస్తరా?.. సీఎం

ఇకపై సినిమా విడుదలకు ముందు ఎలాంటి బెనిఫిట్‌ షోలు ఉండవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. టికెట్ల రేటు పెంపునకు కూడా అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. శనివారం నాడు మంత్రి శాసన సభలో మాట్లాడుతూ ఇక మీదట హీరోలు కూడా థియేటర్లకు వెళ్లవద్దని సూచించారు.
కేవలం సందేశాత్మక, దేశభక్తి చిత్రాలకే రేట్ల పెంపునకు అనుమతి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి సంబంధిత చిత్రాలకే టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఉంటుందని తెలిపారు.

పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. ప్రతీక్‌ ఫౌండేషన్‌ నుంచి ఈ డబ్బులు అందజేస్తామని పేర్కొన్నారు.

 తొక్కిసలాలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ వైద్య ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రేవతి కుటుంబానికి పరిహారం ఇస్తానని చెప్పి అల్లు అర్జున్‌ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా సినిమాలకు ప్రత్యేక మినహాయింపులు ఉండవని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అల్లు అర్జున్‌ అంశంపై స్పందించిన రేవంత్‌ రెడ్డి ” సినిమాలు తీసుకోండి.. వ్యాపారం చేసుకోండి.. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందండి.. ప్రోత్సాహకాలు అందుకోండి.. షూటింగ్‌లకు ప్రత్యేక అనుమతులు తీసుకోండి.. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగిన తర్వాత ప్రత్యేక మినహాయింపులు ఉండవు” అని స్పష్టం చేశారు.

కాగా, సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని చెబుతూ ఈ విషయంలో పోలీస్ వైఫల్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనలో హీరో అల్లు అర్జున్‌ బాధ్యతా రహితంగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు. 11 రోజుల వరకు బాధిత కుటుంబం వద్దకు హీరో, నిర్మాత వెళ్లలేదని, బాధిత కుటుంబాన్ని హీరో, నిర్మాత పరామర్శించలేదని చెప్పారు. 

ఒక్క రోజు హీరో జైలుకు వెళ్లి వస్తేనే  సినిమావారంతా ఇంటికి పరామర్శలకు క్యూ కట్టారని చెబుతూ అల్లు అర్జున్‌కు ఏమైనా కన్ను పోయిందా? కాళ్లు పోయాయా? చేతులు పోయినవా? కిడ్నీలు కరాబైనయా? ఎందుకు వెళ్లారు? అంటూ ప్రశ్నించారు. అక్కడ ఒక తల్లి చనిపోయింది. కొడుకు బ్రెయిన్‌డెడ్‌తో ఆసుపత్రిలో ఉన్నడు. ఒక్కరైనా పరామర్శకు వెళ్లివచ్చారా? అంటూ ఆయన టాలీవుడ్‌ ప్రముఖులపై ముఖ్యమంత్రి మండిపడ్డారు.

ఘటన తర్వాత 11 రోజులు హీరో ఇంటికి వెళ్లారని, కేసు నమోదు అయ్యిందని హీరోకు పోలీసులు చెప్పారని, ఘటనలో ఏ 11గా కేసు నమోదయ్యిందని చెప్పారని తెలిపారు. అయితే,  పోలీసుల పట్ల హీరో అల్లు అర్జున్‌ దురుసుగా ప్రవర్తించారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  విచారణలో భాగంగా హీరోను పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారని పేర్కొంటూ హీరోను పీఎస్‌కు తీసుకెళ్తుంటే కొందరు నేతలు తనను తిడుతూ పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ను మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. అనుమతి తిరస్కరించిన తర్వాత కూడా హీరో థియేటర్కు రావటం సరికాదని ఆ తర్వాత మీడియాతో చెప్పారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే రాజకీయ నేతలు కూడా సభలు రద్దు చేసుకుంటారని ఆయన గుర్తు చేశారు. వేలాది జనం గుమికూడితే బౌన్సర్లు తోసివేశారని ఆయన మండిపడ్డారు. తొక్కిసలాట తర్వాత కూడా హీరో చేతులు ఊపుతూ వెళ్లారని కోమటిరెడ్డి ఆరోపించారు.