సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని, ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అంటూ నటుడు అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ తేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని పేర్కొన్నారు.
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్‌కు వెళ్లి, రోడ్‌షో, ర్యాలీ నిర్వహించినట్టు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని స్పష్టంచేశారు. పోలీసుల అనుమతి తీసుకున్నామని థియేటర్ యాజమాన్యం చెబితేనే అక్కడికి వెళ్లానని తెలిపారు.
శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత రాత్రి 8గంటల సమయంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే ఆయన చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక రాత్రిలో పోగొట్టారని పేర్కొంటూ అందుకు తనకు ఎంతో బాధగా ఉందని చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపాలు లేవనిచెబుతూ తనకు మానవత్వం లేదనడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. థియేటర్ పరిసరాల్లో ఎలాంటి రోడ్‌షో నిర్వహించలేదని అల్లు అర్జున్ తెలిపారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తనకు మరుసటి రోజు వరకు తెలియదని చెప్పారు. తనపై కేసు నమోదు కావడం వల్ల నేరుగా వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవలేకపోయానని తెలిపారు.
థియేటర్ వద్ద రేవతి మృతి విషయం, బాబు ఆరోగ్య పరిస్థితి మరుసటి రోజు తెలిస్తే వెంటనే బన్నీ వాసును పంపించానని తెలిపారు. తాను కూడా వస్తానని చెప్పానని, కానీ అప్పటికే నా మీద అప్పటికే వాళ్లు కేసు నమోదు చేశారని చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ వెళ్తామని ముందుకు వచ్చినా లీగల్ టీమ్ వద్దని చెప్పిందని చెప్పారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకొని నాన్నను వెళ్లమని చెప్పానని, అదీ కుదరదని అన్నారని, కుదిరితే సుకుమార్‌గారిని వెళ్లమని అడిగితే అదీ కుదరలేదన్నారని వివరించారు.
‘థియేటర్ వాళ్లు పర్మిషన్ తీసుకున్నామని చెబితేనే నేను అక్కడకు వెళ్లాను. పోలీసులే అక్కడకు వచ్చిన జనాల్ని నియంత్రిస్తూ నా కారు లోపలికి వెళ్లేలా చూశారు. పోలీసులు అక్కడకు వచ్చారంటే పర్మిషన్ ఇచ్చినట్ట్లే కదా! అభిమానులు చుట్టుముట్టడంతో నా కారు ముందుకు కదల్లేదు. నేను అభివాదం చేస్తే రద్దీ క్లియర్ అవుతుందని పోలీసులు చెప్పడంతోనే చేయి ఊపుతూ ముందుకెళ్లాను’ అని అల్లు అర్జున్ చెప్పారు.
సినిమా చూస్తున్నప్పుడు పోలీసు అధికారులెవ్వరూ తనను కలవలేదని, థియేటర్ యాజమాన్యం వచ్చి బయట రద్దీ పెరుగుతున్నదని చెబితే తాను బయటకు వచ్చానని తెలిపారు. హీరోకు కాళ్లు చేతులు విరిగాయా అన్న సీఎం వ్యాఖ్యలపైనా అల్లు అర్జున్ పరోక్షంగా స్పందించారు. ‘కాళ్లు చేతులు విరిగినా ఏం పర్లేదు. అవన్నీ మామూలే. కానీ నేను మాట్లాడని మాటలను మాట్లాడినట్టు ప్రచారం చేస్తున్నారు’ అంటూ తెలిపారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు